Pawan Kalyan Alliance: ప్రతిపక్షాల ఐక్యతకు అహరహం శ్రమిస్తున్నారు. ప్రతిపక్షాల ఓటు చీలనివ్వకూడదని నడుం కట్టారు. మదమెక్కిన అధికార పార్టీ పీచమణచాలని కంకణం కట్టుకున్నారు. ఏపీలో మార్పు కోసం విరామంలేని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లక్ష్యం అధికారం కాదు. మార్పు సాధించడం. ఏపీని అంధకారంలోకి నెట్టకుండా ఆపడం. మరి జనసేనానితో ప్రతిపక్షాలు కలిసి వస్తాయా ? ఏపీలో మార్పుకు సహకరిస్తాయా ? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ,జనసేన పొత్తు ఖాయమన్న సందర్భంలో ఏపీ బీజేపీ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పింది. ఒంటరిగా వెళ్తామని చెప్పకనే చెప్పింది. ఒకవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఏపీ బీజేపీ ఒంటరిగా వెళ్తున్నామన్న సంకేతాలు ఇచ్చింది. ఇది ఏపీలో కొత్త రాజకీయ చర్చకు పునాది వేసింది. అసలు ఏపీలో ప్రతిపక్షల మధ్య ఏం జరుగుతోందన్న చర్చకు దారితీసింది.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తద్వార ప్రతిపక్షాల ఓటు చీలనివ్వకుండా ఉండేందుకు సాయపడుతుందని ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం తన దారి తనదే అన్నట్టు ముందుకు వెళ్తోంది. ఏపీ బీజేపీలో కొందరికి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. అదే సమయంలో జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా చేస్తే ప్రతిపక్షాల ఓట్లు చీలి వైసీపీ లాభం చేకూరుతుందనేది జనసేన వాదన. టీడీపీని కలుపుకుని వెళ్తే వైసీపీని గద్దెదించవచ్చని జనసేన భావిస్తోంది. అందుకే మూడు పార్టీలను ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం జనసేనాని చేస్తున్నారు.

కలిసొస్తే జనసేనతో .. లేదంటే ఒంటరిగా వెళ్లాలన్న బీజేపీ ఆలోచన వైసీపీకి లబ్ధి చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వార బీజేపీకి ఒరిగేదేం లేదని అంటున్నారు. కేవలం పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ మద్దతు లభిస్తుంది. కానీ ఏపీలో ఏదిగే అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీకి లబ్ది చేకూర్చడం ద్వార బీజేపీ ఎప్పటికీ ఎదగదన్న వాదన చేస్తున్నారు. ప్రతిపక్షాలతో కలిసి వెళ్లి .. సొంతం బలాన్ని గ్రామస్థాయిలో పెంచుకుంటే తప్పా సొంతంగా ఎదగడం సాధ్యం కాదని అంటున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ వ్యాఖ్యల అనంతరం వ్యూహాత్మక ప్రకటన చేశారు. ఏపీలో ప్రతిపక్షాలతో బీజేపీని కలుపుకు వెళ్లడానికి బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతానని చెప్పారు. ఏపీ బీజేపీ ఒంటరిగా వెళ్తున్నామని ప్రకటన చేసినప్పటికీ.. బీజేపీని ప్రతిపక్షాలతో కలుపుకు వెళ్లే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ మరొకసారి చెప్పకనే చెప్పారు. ఏపీలో ఓటు చీలనివ్వకూడదనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అందుకోసం బీజేపీ అధిష్టానంతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అధిష్టానంతో చర్చల తర్వాత ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.