కాంగ్రెస్ లో నాయకత్వలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నాయకులకు నమ్మకం పోతోంది. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు మారిపోతోంది. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నసమయంలో కాంగ్రెస్ లో జవసత్వాలు నింపాల్సిన నాయకులు నింపాదిగా ఉంటున్నారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని చెబుతున్నారు. రాహుల్ గాంధీపై నమ్మకం సడలుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు జితిన్ ప్రసాద కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో అందరిలో అనుమానాలు ఎక్కువవుతున్నాయి.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై పట్టు కోల్పోతున్నారు. దీనికి జితిన్ ప్రసాద రాజీనామానే ఉదాహరణగా చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై నాయకులకు నమ్మకం లేకుండా పోతోంది. రాహుల్ కోటరీలో ముఖ్యమైన నేతలుగా చెప్పుకునే నేతలే ఆయనను విడిచిపోతున్నారు. గతంలో మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కూడా పార్టీ వీడారు. దీంతో ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటుంటే కార్యకర్తలకు కాంగ్రెస్ పై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో సింధియాకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఆయన పార్టీ మారారని తెలుస్తోంది. జితిన్ ప్రసాద కూడా పార్టీ మారడంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు కలుగుతున్నాయి. రాజస్థాన్ లో సచిన్ పైలట్ కూడా అసంతృప్తితో ఉన్నారు. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దినా మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది. దీంతో రాహుల్ గాంధీ ముందు సమస్యలు వెల్లువలా పడి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పార్టీని ముందుకు నడిపించే సత్తా ప్రదర్శించే సమయం ఆసన్నమైంది.
దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉంది. రాజస్థాన్, చత్తీస్ గడ్,పంజాబ్ లలో మాత్రం అధికారం చేజిక్కించుకుంది. దీంతో రాహుల్ గాంధీ చతురతతో పరిస్థితుల్ని చక్కదిద్దే పనిలో నిమగ్నమవ్వాలి. మోడీపై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాహుల్ గాంధీని మానసికంగా దెబ్బతీసేందుకే ఆయన సన్నిహితులను బీజేపీ చేరదీస్తుందని తెలుస్తోంది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించి పార్టీ నాయకత్వాన్ని స్వీకరించి దేశవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ కు మళ్లీ మంచిరోజులు వచ్చేందుకు పాటుపడాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.