Ponguleti Srinivas Reddy: భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికీ ఏ పార్టీలో చేరుతారు అనేది స్పష్టత లేదు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ టీం కలిసింది. నిన్న ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బిజెపి చేరికల కమిటీ కలిసింది. కానీ ఏమీ తేలలేదు. ఎటువైపు అడుగులు వేస్తారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేయలేదు. మొత్తానికి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
కాంగ్రెస్ ఏం హామీ ఇచ్చిందంటే
అప్పట్లో కొప్పుల రాజు ఆధ్వర్యంలోని రాహుల్ గాంధీ టీం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసింది. పార్టీలో చేరాలని ఆహ్వానించింది. అయితే పొంగులేటి దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలో కొన్ని సీట్లు ఇవ్వాలని పొంగులేటి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. పైగా ఖమ్మం తోపాటు మూడు సీట్లు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ నిర్ణయంతో పొంగులేటి వెనుకడుగు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో పొంగులేటి రాకను ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేణుక చౌదరి కూడా పొంగులేటి రాకను స్వాగతిస్తున్నప్పటికీ, అన్ని సీట్లు ఇవ్వడం కుదరదని అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి, కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలు చిక్కబడటం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో..
ఈటల రాజేంద్ర ఆధ్వర్యంలో గురువారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపి నాయకులు కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలో ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. రాజేందర్ వచ్చిన విషయం తనకు తెలియదని బండి సంజయ్ చెప్పడం విశేషం. తనకు ఫోన్ లేదని, ఒకవేళ ఫోన్ ఉంటే సమాచారం అందేదని ఆయన స్పష్టం చేశారు.. ఇక పొంగులేటి ఆర్థిక సామర్థ్యం తెలుసు కాబట్టి, ఉమ్మడి జిల్లాలో ఆయన అభ్యర్థులను మొత్తం గెలిపించుకునేంత సత్తా ఉన్న నేపథ్యంలో బిజెపి పెద్దలు ఆయనను చేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం ఈటల రాజేందర్ కూడా అమిత్ షా డైరెక్షన్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది.. ఈ భేటీలో ఎటువంటి స్పష్టత రాకపోయినప్పటికీ.. త్వరలోనే పొంగులేటి తన నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తన రాజకీయ గురువు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్న నేపథ్యంలో వంగవీటి కూడా అదే పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే మైనార్టీ ఓటు బ్యాంకు దూరం అవుతుందని వారి ఆందోళన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
బిజెపిలో గరం గరం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈటల రాజేందర్ నేతృత్వంలో బిజెపి నాయకులు నేపథ్యంలో బండి సంజయ్ ఒకింత ఆగ్రహం గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పొంగులేటి ఇంటికి వెళ్లే విషయం వారు ఆయనకు చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మీడియా సమావేశంలో కూడా బండి సంజయ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు పొంగులేటి ఇంటికి వెళ్తున్న సమాచారం తనకు చెప్తే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో సీనియర్లను కాదని ఈడ రాజేందర్ ఆయన వద్దకు వెళ్లడం పట్ల బండి ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. చేరికల కమిటీకి ఈటల రాజేందర్ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని కొంతమంది బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.