BJP in Karnataka : కర్నాటక ఎన్నికలకు పట్టుమని వారం రోజులు కూడా లేదు. అన్ని రాజకీయ పక్షాలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎవరికి వారు తమదే గెలుపు అని చెబుతున్నాయి. అయితే మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందని చెబుతున్నాయి. హోరాహోరీ ఫైట్ తప్పదని భావిస్తున్నాయి. బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడానికే చాన్స్ అధికంగా ఉందని చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కలిసి వచ్చిన ఏ అంశాలు ఈ ఎన్నికల్లో రావడం లేదు. ప్రభుత్వ బాధిత వర్గాలు బీజేపీ ఓటమికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఇలా అందరు సిండికేటుగా మారి బీజేపీపై యుద్ధం ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి.
అవినీతి ఆరోపణలు..
ఇక కర్నాటకలో అధికార బీజేపీకి ఓటర్లు మద్దతు తెలపకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడటం, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది జరగకపోవడం, నిరుద్యోగ సమస్యలు..ఇలా చాలావరకూ కారణాలు బీజేపీని ఓటమి అంచున నిలబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రచారం నిర్వహిస్తుండగా.. బీజేపీ మాత్రం హిందుత్వం, రిజర్వేషన్ల అంశంతో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోంది. ప్రధానంగా హిందూ, ముస్లింల మధ్య గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ అది అంతగా వర్కువుట్ అయ్యే చాన్స్ కనిపించడం లేదు.
దిద్దుబాటు చర్యలు చేపట్టినా..
అయితే కర్నాటక వ్యవహరంలో బీజేపీ హైకమాండ్ చాన్నళ్ల కిందటే మేల్కొంది. ముఖ్యంగా అధికార పార్టీ పర్సంటేజీల వ్యవహారం కలకలం సృష్టించింది. రాష్ట్రంలో ఎటువంటి పనులు చేపట్టాలన్నా..40 శాతం పర్సంటేజీలు ముట్టజెప్పాలన్న ఆరోపణ ఉంది. అయితే దీనిపై విపక్షాలు రాద్ధాంతం చేస్తుండగా.. ఏకంగా బాధితవర్గాలైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదుచేశారు. అక్కడకు కొద్దిరోజులకే సీఎం పదవి నుంచి యడ్యూరప్ప దిగిపోవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలతో ప్రధాని మోదీ, షా ద్వయం కీలక నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే హైకమాండ్ అయితే మేల్కొంది కానీ.. బీజేపీ కి భారీ డ్యామేజ్ ఏర్పడింది. దిద్దిబాటు చర్యలకు ఉపక్రమించినా ఫలితం కనిపించేలా లేదు.
యాంటీ బీజేపీ స్లోగన్
ప్రస్తుతం కర్నాటకలో యాంటీ బీజేపీ ప్రబలింది. కాంగ్రెస్ ఆదరణ అనేదానికంటే బీజేపీ వ్యతిరేకతే ఎక్కవ ప్రస్తుపటమైంది. వాస్తవానికి కర్నాటకలో ఒకసారి గెలుపొందిన పార్టీని మరోసారి అక్కడి ప్రజలు ఎన్నుకోరు. ఇది సంప్రదాయంగా వస్తోంది. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ సునాయసంగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూడా ప్రయోగాత్మకంగా ఎన్నికలకు వెళ్తోంది. ఇప్పటికే అనేక మందికి కొత్తవారికి ఆ పార్టీ సీట్లు కేటాయించింది. ప్రభుత్వ బాధిత వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా కసితో పనిచేస్తున్నారు. దీంతో బీజేపీ కలవరపాటుకు గురిచేసింది. దీంతో సిద్ధాంతాలకు విరుద్ధమైన ఉచితాలు ప్రకటించాల్సి వచ్చింది. ఉచితాలతో ఇబ్బందులు అని ప్రధాని మోదీ ప్రకటించిన వారం రోజుల వ్యవధిలోనే.. బీజేపీ మేనిఫెస్టోలో ఏకంగా ఉచిత పథకాలు ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల భయంతోనే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.