Pawan Kalyan: పరిషత్ ఎన్నికల్లో జనసేనకు దక్కిన విజయంతో పవన్ లో దూకుడు పెరిగింది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ విశాఖ కేంద్రంగా పాలన చేస్తారని గ్రహించిన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో మళ్లీ గాజువాక నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి కూడా ఇక్కడి నుంచే బరిలో నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో నాదండ్ల మనోహర్ సమావేశాలు నిర్వహిస్తూ వారిని పార్టీ వైపు తిప్పుకునేందుకు హామీలు ఇస్తున్నారు. దీంతో పవన్ పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నట్లు సమాచారం.
స్టీల్ ప్లాంట్ కార్మికులతో పవన్ కల్యాణ్ త్వరలో భేటీ అయి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పవన్ మళ్లీ జిల్లా నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో గాజువాక నుంచే లేకపోతే భీమిలి నుంచి పోటీలో నిలిచేందుకు భావిస్తున్నట్లు సమాచారం. జనసేన పరిషత్ ఎన్నికల్లో పార్టీ 25 శాతం ఓట్లు సాధించడంతో పవన్ లో ఉత్సాహం పెరిగినట్లు కనిపిస్తోంది.
అయితే జనసేన పొత్తు ఎవరితో ఉంటుందనే దానిపై స్పష్టత రావడం లేదు. బీజేపీతో జత కట్టినా భవిష్యత్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ పార్టీతో పొత్తు ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీతో కూడా పొత్తు ఉంటుందేమోనని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం జనసేన మరింత స్థాయి పెంచుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.