Nara Brahmani: తెలుగుదేశం పార్టీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబు. అటువంటి నాయకుడే ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. కేసుల్లో ఇరుక్కొని జైల్లో గడుపుతున్నారు.ఆయన కుమారుడు లోకేష్ చుట్టూ కేసులు అల్లుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి ఆశాదీపంలా కనిపిస్తున్నారు నారా బ్రాహ్మణి. నందమూరి బిడ్డగా.. నారా వారి కోడలిగా ఆమె అయితే సరిపోతారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆమె నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. తప్పనిసరిగా బ్రాహ్మణికి టిడిపి పగ్గాలు అప్పగించాలని కోరుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు అనంతరం తెలుగుదేశం పార్టీ డీలా పడిపోయింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియడం లేదు. దీనికి తోడు మరి కొన్ని కేసులు తోడవుతున్నాయి. ఇటువంటి తరుణంలో టిడిపికి ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరమని సీనియర్లు భావిస్తున్నారు.నారా భువనేశ్వరి, బాలకృష్ణ కంటే బ్రాహ్మణి అయితేనే రాణించగలరని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. మంచి వాగ్ధాటి, జనాకర్షణ గల నాయకురాలిగా బ్రాహ్మణి రాణిస్తారని పార్టీ శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి.
చంద్రబాబు అరెస్టు తరువాత బ్రాహ్మణి తెరపైకి వచ్చారు. అత్త భువనేశ్వరితో కలిసి రాజమండ్రిలోనే గడుపుతున్నారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటు మీడియా సమావేశాల్లో సైతం చెక్కుచెదరని ధైర్యం ప్రదర్శిస్తున్నారు. సమయస్ఫూర్తిగా ప్రసంగాలు చేస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణికి పొలిటికల్ ట్రైనింగ్ క్లాసులు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలతో పాటు సమకాలీన రాజకీయాలపై శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.
బ్రాహ్మణి సైతం మానసికంగా సిద్ధమయ్యారని.. కుటుంబ సభ్యుల సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అటు నందమూరి ఆడపడుచు గా, ఇటు నారావారి కోడలుగా ఆమెకు ఆదరణ దక్కుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జనాలతో ఎలా మమేకం కావాలి? ఎటువంటి విషయాలపై మాట్లాడాలి? సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాలి? వంటి వాటిని బ్రాహ్మణి అకలింపు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు, లోకేషు లపై నమోదు చేసిన కేసులపై సైతం ఆమె స్టడీ చేస్తున్నట్లు సమాచారం. ప్రజల మధ్యకు వెళ్లేటప్పుడు వాటిపై సమగ్రంగా వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బ్రాహ్మణితో జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ చెప్పవచ్చని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అంటే పార్టీ శ్రేణులు అభిమానించేవి. తమ వాడిగానే భావించేవి. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత తారక్ స్పందించకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సైతం మార్పు వచ్చింది. తారక్ పై ఓకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో నందమూరి బిడ్డ అయిన బ్రాహ్మణి తెరపైకి వస్తే.. పార్టీలో తారక్ అనే మాట కనుమరుగవుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు, లోకేష్ లు కేసుల నుంచి బయటపడినా.. బ్రాహ్మణి సేవలను వినియోగించుకుంటే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఉందో చూడాలి.
Recommended Video: