MLA Roja: సినీ నటి రోజా ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరు తెచ్చుకుంది. నగరి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందిన రోజా.. మంత్రి అవుతారనే ప్రచారం నియోజకవర్గంలో చాలా కాలం నుంచి ఉంది. కాగా, త్వరలో ఏపీలో జరగబోయే కేబినెట్ విస్తరణలో రోజాకు చాన్స్ దక్కొచ్చనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే, చిత్తూరు జిల్లా నుంచి ఇప్పుడున్న సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈ సారి కూడా మంత్రి పదవి రోజాకు దక్కేలా లేదని మరికొందరు అంటున్నారు.

రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి సొంత పార్టీలోని వైసీపీ నేతలు కారణమవుతున్నారనే చర్చ కూడా ఉంది. నగరి నియోజకవర్గంలో రోజా రోజురోజుకూ పట్టు కోల్పోతున్నారని తెలుస్తోంది. రోజాకు రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక నామినేటెడ్ పదవి ఇచ్చారు. కానీ, కొద్ది రోజులకే దానిని తీసేశారు. ఈ క్రమంలోనే మళ్లీ రోజాకు పదవి దక్కేనా అనే చర్చ ఉంది. తాజాగా ఆ చర్చ మళ్లీ షురూ అయింది.
ఇకపోతే నగరిలో రోజాకు సొంత పార్టీ వైసీపీలోనే విపక్షం ఉండటం కూడా ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడానికి ఓ కారణంగా ఉందని పలువురు అంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సొంత పార్టీ సీనియర్ నేత మద్దతుతోనే పలువురు నేతలు, కార్యకర్తలు రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ రోజా వర్గీయులు ఆరోపిస్తున్నారు.
తనను జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ఎదుట కన్నీటి పర్యంతమైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మొత్తంగా రోజా రెండో సారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నగరిలో పట్టు నిలుపుకునేందుకుగాను ఇబ్బందులు పడుతున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజక వర్గంలో పర్యటించటం పైన కూడా రోజా సీరియస్ అయ్యారు. అలా సొంత పార్టీ వైసీపీ నేతలే రోజాకు ప్రత్యర్థులవుతున్నారు. దాంతో రోజా పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘డిజిటల్’ సెగ వైసీపీకి బాగానే తగులుతోందే?
ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ రోజా మాట కాదని వైసీపీలోని మరో వర్గం గట్టిపోటీ ఇవ్వబోయింది. ఈ విషయాలన్నీ రోజా ఎప్పటికప్పుడు అధిష్టానం తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డికి ఈ విషయాలను రోజా చెప్పింది కూడా. మొత్తంగా రోజా తన పట్టు నిలుపుకునేందుకుగాను చాలానే కష్టపడుతోంది. ఈ క్రమంలోనే రోజాకు మంత్రి పదవి వరిస్తే కనుక మొదలు సొంత పార్టీలోని ప్రత్యర్థుల పని చెప్పే అవకాశాలున్నాయి. సీఎం జగన్ బర్త్ డే వేడుకల నిర్వహణలోనూ రోజాకు సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం నుంచి ఇబ్బందులు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంలోనే పార్టీలో పట్టు సాధించలేకపోయిన రోజాకు మంత్రి పదవి వచ్చే చాన్సెస్ ఉన్నాయా? అని రాజకీయ వర్గాలు, ముఖ్యంగా వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Also Read: Nara Bhuvaneswari: నాకు ఎవరి క్షమాపణలు అవసరంలేదు.. నారా భువనేశ్వరి ఫైర్!