
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. తెలుగు దేశం పార్టీ ముఖ్య కార్యాలయం. ఇలాంటి కార్యాలయం ఇప్పుడు తెలంగాణలో మూలస్తంభంగా ఉన్నా.. ఇక్కడ టీడీపీ పని అయిపోవడంతో కళ తప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో కీలక భూమిక పోషించిన ఈ భవనం ఇప్పుడు ఎవరికి పట్టకుండా బావురమేనేలా కనిపిస్తోంది.
తాజాగా ఎన్టీఆర్ భవన్ విషయంలో మరో ట్విస్ట్ వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం ప్రధాన కార్యాలయమైన ఈ భవన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు బుధవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. వెంటనే భవనం లీజు రద్దు చేసి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని అభ్యర్థించడం సంచలనమైంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ 1997లో బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 2 వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడునిర్మించారు. ఈ భూమిని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు నెలకు రూ.90వేల నామమాత్రపు అద్దెకు 30 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. 2014 వరకు ఉమ్మడి ఏపీలో ఇది టీడీపీ ప్రధాన కార్యంగా ఉంది. బ్లడ్ బ్యాంకు నిర్వహించారు.
విభజనతో టీడీపీ ప్రధాన కార్యాలయం ప్రభ ఆరిపోయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు గుంటూరు టీడీపీ ఆఫీసుకు వెళ్లారు. తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్ లో పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తెలంగాణలో టీడీపీ కనమరుగు కావడంతో ఎవరూ ఈ ఆఫీసుకు రావడం లేదు. అందులో 15 ఏళ్లుగా పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇప్పటికీ ఆంధ్రా వారి నియంత్రణలో పనిచేస్తున్నామని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆంధ్ర ఉద్యోగులు దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఉద్యోగులు ఆరోపించారు. టీడీపీ ఎల్. రమణ కూడా నిస్సహాయంగా ఉన్నారు అని ఉద్యోగులు కేసీఆర్ కు లేఖలో పేర్కొన్నారు. జీతాలు పైసా పెంచడం లేదడని.. గుంటూరు ఉద్యోగులకు భారీ పెంచారని ఆరోపించారు.పీఎఫ్, బీమా సౌకర్యాలు లేవని.. ఈ లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ను అభ్యర్థించారు.