
తెలంగాణ సర్కారు కొత్త రేషన్ కార్డుల జారీకి సంకల్పించింది. రేషన్ కార్డుల జారీపై రాష్ర్ట పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలోనే రేషన్ కార్డుల జారీకి ప్రయత్నించినా అది ఆచరణ సాధ్యం కాలేదు. ఈటల రాజేందర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రజలకు రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించినా తరువాత మరిచిపోయారు. దీంతో ప్రస్తుతం రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్నా అవి చేతులకు వచ్చేదాకా నమ్మకం లేదని చెబుతున్నారు.
రాష్ర్టవ్యాప్తంగా 4,15,901 రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ జరిగింది. నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసీ, టీఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ధ్రువీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. పదిహేను రోజులుగా జిల్లా స్థాయిలో రెవెన్యూతో పాటు ఇతర సిబ్బంది రాజధానిలో జీహెచ్ఎంసీతోపాటు ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి రేషన్ కార్డుల జారీ చేస్తామని చెబుతున్న అధికారుల తీరుపై ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారో వేచి చూడాల్సిందే.
ప్రతి అర్హుడిని గుర్తించడం కోసం కలెక్టర్లు, డీసీఎఫ్వోలు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. నూతన కార్డుల జారీ ద్వారా రాసర్ట ప్రభుత్వంపై ఎంత భారం పడినా సిద్ధంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ పేదవారి ఆకలి తీర్చడానికే నిరంతరం కృషి చేస్తున్నారు. రేషన్ కార్డుల జారీ అయ్యేంత వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డుల జారీ వేగవంతంగా సాగుతుందని ఆశిస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీపై అనుమానాలున్నా వాటిని పటాపంచలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఆలస్యం ఉండదని చెబుతున్నారు.