Telangana: తెలంగాణ రాష్ర్ట సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం కేసీఆర్ పేరుతో నామినేషన్ దాఖలయ్యాయి. దీంతో పోటీలో ఎవరు ఉండే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనమే. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఈనెల 22 వరకు గడువు ఉంది. కానీ మరో నామినేషన్ దాఖలయ్యే సూచనలు లేకపోవడంతో కేసీఆర్ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ(Telangana) భవన్ లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో టీఆర్ఎస్ చీఫ్ గా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ నెల 22న నామినేషన్ పత్రాల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. మరుసటి రోజు నామినేషన్లు పరిశీలిస్తారు. 25న మాదాపూర్ లోని హైటెక్స్ లో నిర్వహించే ప్లీనరీలో అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. ఆయనకు పోటీగా ఎవరు కూడా నామినేషన్ వేసే అవకాశం లేకపోవడంతో కేసీఆర్ అధ్యక్షుడిగా ఎన్నికైతే వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా పుంజుకుంటుండటంతో కేసీఆర్ ఒక్కరే ప్రతిపక్షాలను ఎదుర్కొనే సత్తా ఉన్న వారని గుర్తించి ఆయననే అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంతో టీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నారు. దీనికోసమే ఆయన అభ్యర్థిత్వంపై నేతలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.