JanaSena- MLC Elections: వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్ అన్ని పార్టీలకు కీలకమే. ఇప్పుడాయన ఏపీ రాజకీయాల్లో సెంటారాఫ్ అట్రాక్షన్. ఆయన మావాడంటే మావాడు అంటూ టీడీపీ, బీజేపీలు గోలగోల చేస్తున్నాయి. పవన్ ఎవరితోనూ కలవకూడదని అధికార వైసీపీ భావిస్తోంది. అయితే ఎలక్షన్ నాటికి ఈ మూడు పార్టీలు ఒకే గూటికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే అనుమానాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తూ కూడా వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ ఆ రెండు పార్టీలతో కలిస్తే వైసీపీకి దెబ్బ ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు వారి కలయికను ఇష్టపడడంలేదు. అయితే ఇప్పుడు సాధారణ ఎన్నికలకు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అసలు సిసలు పరీక్ష ఎదురుకాబోతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఏ పార్టీకి ఎవరు మద్దతిస్తారో అన్నది తేలాల్సి ఉంది.

గతసారి ఇక్కడి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నాటి అధికార పార్టీ టీడీపీ సహకారంతో సునాయసంగా బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలుపొందారు. ఈసారి ఆయనే బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రధాన రాజకీయ పక్షాలు దిగింది తక్కువే. ప్రజా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బరిలో దిగితే వారికి మద్దతు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత ఎన్నికల్లో ఈ విధానానికి బ్రేక్ పడింది. అయితే ఈసారి అధికార వైసీపీ అభ్యర్థిని సైతం రంగంలోకి దించుతుండడంతో టీడీపీ పునరాలోచనలో పడింది. జీవీఎంసీ కార్పొరేటర్, బలహీనవర్గాలకు చెందిన మహిళను టీడీపీ పోటీలో పెట్టింది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే పార్టీ కేండిడేట్ పెట్టని జనసేన వైపు ఇప్పుడు టీడీపీ, బీజేపీలు చూస్తున్నాయి.

జనసేనకు యూత్ బలం ఎక్కువ. పవన్ అంటూ యూత్ లోనే హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ పిలుపునిస్తే ఎటువంటి కార్యక్రమానికైనా సిద్ధంగా ఉంటారు. అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలానా పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తే మాత్రం అహోరాత్రులు శ్రమించే పరిస్థితి ఉంది. అందుకే తమకు మద్దతు తెలపాలని అటు బీజేపీ, ఇటు టీడీపీ పవన్ ను కోరుతూ వస్తున్నాయి. గత ఎన్నికల నుంచే బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. కానీ ఇటీవల పవన్ వ్యూహంలో మార్పు వచ్చింది. పైగా ఆయన ఇటీవల చంద్రబాబుతో సన్నిహితంగా ఉండడం బీజేపీలో అనుమానాలు పెరుగుతున్నాయి. అందుకే పవన్ మాకే మద్దతిస్తాడని గట్టిగా చెప్పలేకపోతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తటస్థంగా ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భవిష్యత్ లో కలిసి నడవాలనుకుంటున్న పార్టీలు కనుక.. వారికి ఇబ్బందులు కలుగకుండా జనసేన నుంచి నేరుగా అభ్యర్థిని బరిలో దించితే సరిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై కొద్దిరోజుల్లో కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడే అవకాశముందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి,