ఏపీ సీఎం జగన్ ప్రతిష్టకు ఇప్పుడు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం సవాల్ గా మారింది. జగన్ కు చావో రేవోలాగా మారింది. ఇజ్జత్ కా సవాల్ గా మారిన ఈ ఇష్యూలో సుప్రీం కోర్టు ఏం తీర్పునిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను తొలగించారు. ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో రసకందాయంలో ఈ వివాదం పడింది.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు చివరి అంకానికి చేరింది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈనెల 10న ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టబోతోంది. దీంతో ఈ నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ గెలుస్తాడా? నిమ్మగడ్డ విజయం సాధిస్తాడా? మళ్లీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ వస్తే మాత్రం జగన్ కు ఇంతకంటే ఘోరమైన అవమానం ఉండదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.
ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈనెల 10న ఈ లీవ్ పిటీషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించబోతోంది. ఏపీ ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తారు.
ఇక ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే నిమ్మగడ్డకు మద్దతుగా బీజేపీ నేత కామినేని శ్రీనివాస్, కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, టీడీపీ నేత వర్ల రామయ్య సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని సుప్రీంకోర్టు ఈనెల 10న విచారించనుంది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై నిమ్మగడ్డకు సపోర్టుగా సుప్రీం కోర్టులో నిలబడడం హాట్ టాపిక్ గా మారింది.ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భవితవ్యం విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుందనేది ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.