జ‌గ‌న్ మ‌రో చంద్ర‌బాబు అవుతారా?

వ్య‌క్తిగ‌తానికి.. రాజ‌కీయ జీవితానికి చాలా తేడా ఉంటుంది. సొంత జీవితం విష‌యానికి వ‌స్తే.. దేనికైనా సై అనొచ్చు. వ‌చ్చే ఫ‌లితం ఎలాంటిదైనా స్వీక‌రించొచ్చు. కానీ.. పాలిటిక్స్ అలా కాదు. ర‌క‌ర‌కాల మ‌నుషులు.. ప‌లు విధాల మ‌న‌స్త‌త్వాలు.. కులాలు, మ‌తాలు, ప్రాంతాలు. స‌మ్మ‌తి, అస‌మ్మ‌తి.. ఫిరాయింపు, బుబ్జ‌గింపు.. హ‌బ్బో ఒక్క‌టేమిటీ? స‌వాల‌క్ష ఉంటాయి. ఇవ‌న్నీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. లెక్క‌లు మారిపోతాయి. దాని తీవ్ర‌త‌ను బ‌ట్టి.. ప్ర‌భుత్వాలే కూలిపోతాయి. ఇలాంటి […]

Written By: Bhaskar, Updated On : June 14, 2021 2:50 pm
Follow us on

వ్య‌క్తిగ‌తానికి.. రాజ‌కీయ జీవితానికి చాలా తేడా ఉంటుంది. సొంత జీవితం విష‌యానికి వ‌స్తే.. దేనికైనా సై అనొచ్చు. వ‌చ్చే ఫ‌లితం ఎలాంటిదైనా స్వీక‌రించొచ్చు. కానీ.. పాలిటిక్స్ అలా కాదు. ర‌క‌ర‌కాల మ‌నుషులు.. ప‌లు విధాల మ‌న‌స్త‌త్వాలు.. కులాలు, మ‌తాలు, ప్రాంతాలు. స‌మ్మ‌తి, అస‌మ్మ‌తి.. ఫిరాయింపు, బుబ్జ‌గింపు.. హ‌బ్బో ఒక్క‌టేమిటీ? స‌వాల‌క్ష ఉంటాయి. ఇవ‌న్నీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. లెక్క‌లు మారిపోతాయి. దాని తీవ్ర‌త‌ను బ‌ట్టి.. ప్ర‌భుత్వాలే కూలిపోతాయి. ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు చ‌రిత్ర‌లో అడుగ‌డుగునా క‌నిపిస్తాయి. ఇప్పుడు జ‌గ‌న్ కు ఇలాంటి గండాన్ని దాటాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. మ‌రి, ఏం చేయ‌బోతున్నారు? ఎలా చేయ‌బోతున్నారు? అన్న‌దే అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం.

జ‌గ‌న్ ఎదుర్కోబోతున్న అస‌లైన ప‌రీక్ష మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో అధికారాన్ని కట్ట‌బెట్టారు. ఫుల్లు హ్యాపీగా పాల‌న మొద‌లు పెట్టారు జ‌గ‌న్‌. అయితే.. వైసీపీలోని 151 మంది ఎమ్మెల్యేల్లో.. మంత్రివ‌ర్గంలో స్థానం ఆశించిన‌ వారి సంఖ్య వంద మందికిపైనే ఉంది. కానీ.. తొలిసారి పాతిక‌ మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు జ‌గ‌న్‌. మిగిలిన‌.. ఆశావ‌హులు అంద‌రినీ సైలెంట్ గా ఉంచడానికి ఓ మంత్రం వేశారు. ఇప్పుడున్న మంత్రివ‌ర్గం స‌రిగ్గా రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఉంటుందని, ఆ త‌ర్వాత మిగిలిన వారికి అవ‌కాశం ఇస్తా అని చెప్పారు. దీంతో.. ఆశావ‌హులకు సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. జ‌గ‌న్ పాల‌న చేప‌ట్టి రెండేళ్లు పూర్త‌య్యాయి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం మొద‌లైంది. మంత్రి ప‌ద‌వులు ఎవ‌రికి ద‌క్కుతాయి? అనే చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఎవ‌రిని త‌ప్పిస్తారు? అంటూ ఎవ‌రి లెక్క‌లు వారు వేస్తూనే ఉన్నారు. మ‌రి, జ‌గ‌న్ ఏం చేయ‌బోతున్నాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి నాళ్ల‌లో మంత్రివ‌ర్గం ఏర్పాటుకు.. స‌గం పాల‌న త‌ర్వాత చేసే విస్త‌ర‌ణ‌కు చాలా తేడా ఉంటుంది. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న‌వాళ్ల‌ను తొల‌గించడం క‌త్తిమీద సాము వంటిదే. వాళ్లు అస‌మ్మ‌తి గ‌ళం వినిపించుకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆశావ‌హుల్లో అంద‌రికీ ప‌ద‌వులు ఇవ్వ‌డం అనేది కూడా జ‌ర‌గ‌ని ప‌ని. అలాంటి వారిని కూడా క‌నిపెట్టుకు ఉండాల్సి ఉంటుంది.

ఇటు చూస్తే.. సొంత పార్టీలోనే ర‌ఘురామ విప‌క్ష గ‌ళం వినిపిస్తున్నారు. చంద్ర‌బాబు వంటివారు ఈ ప‌రిస్థితి మ‌రింత విస్తృతం కావాలని ఆకాంక్షించ‌డం స‌హ‌జం. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణే అందుకు స‌రైన వేదిక అని కూడా వారు ఆశిస్తున్నారు. మ‌రింత మంది ర‌ఘురామ‌లు వైసీపీలో ఉద్భ‌వించాల‌ని వారు కోరుకోవ‌డం కూడా స‌హ‌జం. ఇలాంటి ప‌రిస్థితుల‌ను జ‌గ‌న్ ఇప్పుడు డీల్ చేయాల్సి ఉంటుంది. కొత్త‌గా ప‌ద‌వులు ఇచ్చేవారి విష‌యంలో.. ఉన్న‌వాళ్ల‌ను తొల‌గించే విష‌యంలో.. కులం, మ‌తం, ప్రాంతం, వ్య‌క్తిగ‌త బ‌లం అన్నీ చూడాల్సి ఉంటుంది.

బొత్స స‌త్యానారాయ‌ణ వంటి సీనియ‌ర్ల‌ను వెంట ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కొడాలి నాని, అవంతి వంటి వారికి రాం రామం చెప్పొచ్చ‌నే అంటున్నారు. ఉప ముఖ్య‌మంత్రుల్లో ప‌లువురిని ప‌క్క‌న పెట్టొచ్చ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విధంగా ఎవ‌రి అభిప్రాయాలు వాళ్లు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. మ‌రోసారి విస్త‌ర‌ణ‌కు అవ‌కాశం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఎవ‌రి జాత‌కం ఏంటో ఎవ‌రూ చెప్ప‌లేరు. అందువ‌ల్ల ఈ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వి వ‌దులుకోవ‌డానికి ఎవ్వ‌రూ అంగీక‌రించ‌రు అనేది య‌థార్థం. మ‌రి, జ‌గ‌న్ ఈ ప‌రిస్థితి స‌రిగ్గా డీల్ చేసి.. తాను కూడా అస‌లైన రాజ‌కీయ‌వేత్త‌ను అని చాటుకుంటారా? లేక ఈ తేనె తుట్టెను క‌ద‌ప‌డం ఎందుకులే అని మౌనంగా ఉంటారా? అనేది అస‌లైన ప్ర‌శ్న‌. ఒక‌వేళ రెండోదాన్ని ఎంచుకుంటే మాత్రం.. చంద్ర‌బాబు ప‌ద్ధ‌తిని అనుస‌రించిన‌ట్టేన‌ని, అది ఖ‌చ్చితంగా పుట్టిముంచ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, జ‌గ‌న్ ఫైన‌ల్ గా త‌న‌ను ఎలా నిరూపించుకుంటారు? ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారు? అన్న‌దే తేలాల్సిన ప్ర‌శ్న‌.