ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజికవర్గ విభజన స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్డి వర్గానికి చెందిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బలమైన సామాజిక వర్గంగా చెప్పుకునే కమ్మలను అణగదొక్కుతున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇటు జగన్ కూడా నేరుగానే వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి వారికోసమేనని, ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం లేదని కూడా అనేశారు. అలాంటి రాజధాని అవసరమా? అని కూడా అన్నారు. దీంతో.. రాజకీయ వర్గవిభజన స్పష్టమైంది.
దీంతో.. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం మెజారిటీ టీడీపీకి సపోర్టు చేస్తుందనే విశ్లేషణలు కూడా వచ్చాయి. నిజానికి గత ఎన్నికల్లో చాలా మంది కమ్మలు జగన్ కు మద్దతుగా నిలిచారు. కుల సమీకరణలు, క్యాస్టు ఫీలింగులు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ లో.. తమ వర్గానికి చెందిన బాబును కాదని, జగన్ కు మద్దతుగా నిలిచారు. కానీ.. జగన్ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో వచ్చింది.
ఈ పరిస్థితి మున్ముందు ముదిరితే.. వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయం వైసీపీలో ఉంది. అందుకే.. సాధ్యమైనంత త్వరగా ఈ ఫీలింగులు గట్రా దూరం చేసి, అందరివాడిగా జగన్ ఎన్నికల బరిలో నిలివాలని నేతలు ఆశిస్తున్నారు. అందుకు సరైన అవకాశం ఇప్పుడు వచ్చిందని అంటున్నారు. అదే టీటీడీ చైర్మన్ పోస్టు.
ప్రస్తుతం టీటీడీ బోర్డు రద్దైంది. త్వరలోనే మళ్లీ ఏర్పాటు కానుంది. దీంతో.. చైర్మన్ పదవిని ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. టీటీడీ చైర్మన్ పదవి రాజకీయంగా ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. అందుకే.. చాలా మంది ఈ పదవికోసం ఆరాటపడుతుంటారు. కొందరైతే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ గా కూడా భావిస్తుంటారు. అందువల్ల.. ఈ పదవిని కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే.. వారిని శాంత పరిచినట్టు అవుతుందని, తమకు సైతం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఫీలింగ్ వారిలో కల్పించినట్టు అవుతుందని అంటున్నారు.
ఆక, ఆశావహులు సైతం ఎక్కువగానే ఉన్నారు. చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వంటి నేతలు చాలా మంది ఈ చైర్మన్ సీటు కోసం చూస్తున్నారని అంటున్నారు. అంతేకాదు.. టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కూడా ఎంతో కాలంగా వెయిటింగ్ లో ఉన్నారు. ఈ చైర్మన్ గిరి ఇస్తే.. వైసీపీలోకి జంప్ చేసేందుకు సైతం ఆయన సిద్ధఃగా ఉన్నారనే పుకార్లు కూడా ఉన్నాయి. మరి, ఈ నేపథ్యంలో జగన్ ఏం చేస్తారు? అన్నది చూడాలి.