Jharkhand Politics: “రేయ్ వాడు ఆట ఆడుతున్నాడు రా.. చిన్నపిల్లలు ఆడతారే తొక్కుడు బిల్ల.. వాళ్లు బిల్ల పడితే అక్కడ ఓ గీత గీసుకుంటారు. కానీ వాడు తన బిళ్ళను ఎక్కడ పడితే అక్కడ విసిరి అక్కడ గీత గీసుకుంటాడు”.. కేజీఎఫ్_2 లో రాఖీ దూకుడు ను వివరిస్తూ ఓ పాత్రధారి పలికే డైలాగ్ ఇది. బహుశా ఇప్పుడు దేశ రాజకీయాల్లో అమిత్ షా సాగిస్తున్న దూకుడుకు కూడా ఈ డైలాగ్ నే ఆపాదించాలేమో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో సాధించిన విజయాలతో బిజెపి రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే దూకుడును పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఆ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రూపంలో బిజెపికి అదృష్టం కొంత దూరంలోనే ఉంది. అన్ని జరిగితే అది మరో మహారాష్ట్ర అవడం ఎంతో దూరంలో లేదు. దీనికి బిజెపి వేస్తున్న ఎత్తులకంటే హేమంత్ సోరెన్ స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉంది.
హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి. అక్కడ అపారంగా బొగ్గు నిల్వలు ఉంటాయి. అందుకే మైనింగ్ శాఖను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆమధ్య తనకి తానే మైనింగ్ లీజుకు ఇచ్చుకున్నాడు. మైనింగ్ కు సంబంధించి పర్యావరణ, అటవీశాఖ క్లియరెన్స్ కూడా తనే ఇచ్చుకున్నాడు. తన భార్య కల్పనకు ఇండస్ట్రియల్ కారిడార్ లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించాడు. తన రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మీడియా సలహదారు అభిషేక్ ప్రసాద్ కు కూడా మైనింగ్ లీజుకు ఇచ్చాడు. దీనికి సంబంధించి హైకోర్టులో కేసు నమోదయింది. సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. దీంతో బీజేపీ రంగంలోకి దిగింది. ఆట మొదలుపెట్టింది. శాసనసభ్యుడుగా హేమంత్ సోరెన్ పై వేటువేయాలని కోరింది.. గవర్నర్ కార్యాలయం రకరకాల ఆర్టికల్స్ 191, 192, పదో షెడ్యూల్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్.. ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుంది. జార్ఖండ్ చీఫ్ సెక్రటరీ లేఖను ఇందుకు పరిగణలోకి తీసుకుంది. అన్ని జరిగిపోయాయి కాబట్టి ఇక హేమంత్ పై అనర్హత వేటు వేయడం మాత్రమే మిగిలింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జెడి కూటమి మొత్తం 81 సీట్లకు గాను 47 స్థానాల్లో గెలుపొందాయి. ఇందులో జార్ఖండ్ ముక్తి మోర్చా వాటా 30 సీట్లు. అయితే బిజెపి అప్పుడు కేవలం 25 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ రాష్ట్రంపై బీజేపీ మొదటి నుంచి నమ్మకంతో ఉంది. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ కూటమి విజయం సాధించింది..
ప్రస్తుతం వస్తున్న ఆరోపణ నేపథ్యంలో హేమంత్ సీఎం కూర్చిని వదలడం దాదాపు ఖాయమని అక్కడి మీడియా కోడై కోస్తోంది. ఒకవేళ తను కుర్చి వదిలితే ఎవరిని కూర్చో పెడతాడు? తన తండ్రి శిబు సోరెన్ కు 78 సంవత్సరాలు. ఈ వయసులో అతడు ముఖ్యమంత్రిగా పని చేయలేడు. బంధువులను నమ్మలేడు. చివరగా హేమంత్ కు మిగిలింది ఒకే ఒక అవకాశం.. అదే ఆయన భార్య కల్పన.. ఒకవేళ తను అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సీటును వదులు కోవాల్సి వస్తే, కచ్చితంగా తన భార్యను అందులో కూర్చోబెట్టాలి అనుకుంటున్నాడు.. అదే జరిగితే ఆమె మరో రబ్రీ అవుతుంది. ఇవన్నీ జరిగే కంటే ముందే హేమంత్ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై ఏడాది క్రితమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నజర్ పెట్టాడు. ఎప్పుడైతే హేమంత్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిశాడో.. అప్పుడే షా పకడ్బందీ స్కెచ్ గీశాడు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులను ఝార్ఖండ్ పంపించి మైనింగ్ అక్రమాలను వెలికి తీశాడు. అంతేకాదు కేసును హైకోర్టు దాకా వెళ్లేలా చేశాడు. పకడ్బందీ ఆధారాలు సమర్పించడంతో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా తప్పు జరిగింది మన్నించండి అని కోర్టును వేడుకున్నాడు. తర్వాత సీన్ పూర్తిగా హేమంత్ కు అర్థమైంది. వెంటనే అమిత్ షా దగ్గరికి వెళ్ళాడు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తను చెబుతుంటే షా విన్నాడు కానీ.. అతని మనసులో ఏముందో హేమంత్ కు తెలుసు. దీంతో నిర్వేదమైన ముఖంతో జార్ఖండ్ వచ్చాడు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు కానీ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగపరంగా అన్ని వైపులా ఒత్తిళ్లు తీసుకొని వస్తుండడంతో హేమంత్ కు అసలు సినిమా అర్థమవుతున్నది. బిజెపికి ఇప్పుడు ఏకనాథ్ షిండే దొరకలేదు కానీ.. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా వారి చేతిలోకి జార్ఖండ్ వెళ్లిపోయేది. ఇప్పుడు మాత్రం దూరంగా ఉందని కాదు.. ఒకవేళ హేమంత్ సతీమణి ముఖ్యమంత్రి అయితే.. అప్పుడు బిజెపి ఆడే ఆట వేరే తీరుగా ఉంటుంది.