Revanth Reddy: తెలంగాణలో కనుమరుగు అయిపోతుందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి గాడిన పడుతోంది. రాజకీయం ‘చేయి’ జారి పోతుందనుకుంటున్న తరుణంలో యువతరం ‘చేతి’లో ఊపిరిపోసుకుంటోంది. ఇన్నాళ్లు మూడుకాళ్ల ముసలివాళ్ల ‘చేతి’లో పడలేక.. లేవలేక నల్లేరుపై నత్తలా సాగిన కాంగ్రెస్ ప్రయాణం మళ్లీ టాప్ గేరులో ముందుకు సాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ ఆరిపోయే దీపమో.. ఆకర్ష మంత్రమోనని భావిస్తున్నారు. యువనాయకుడి బాటలో పెద్దలు ఎలాగూ కలిసిరారని తెలిసినా.. కార్యకర్తలే బలంగా టార్గెట్ 2023 మంత్రంగా యంగ్ లీడర్ టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే కేవలం నోటిబలం.. కార్యకర్తల బలంతోనే రేవంత్ సీఎం కుర్చీని అధిరోహించగలడా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
.. అవును రెండేళ్ల నాటి కాంగ్రెస్.. నేటి కాంగ్రెస్ ఒకటికాదు.. నిత్యం ఆధిపత్య పోరులో సతమతమైన గాంధీ భవన్ ప్రస్తుతం వ్యూహ.. ప్రతివ్యూహాల కసరత్తులతో కథం తొక్కుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తరువాత కాంగ్రెస్ లో బూస్టర్ ఎనర్జీ కనిపిస్తోంది. పదవి స్వీకరించగానే అధికార పార్టీపై మాటల తూటాలు పేల్చడం ప్రారంభించిన రేవంత్ రెడ్డి కార్యకర్తలకు కూడా కొత్త సూచనలు చేశారు. తన కోసం కాదని.. పార్టీని నిలబెట్టడం కోసం పనిచేయాలని హితవు పలికారు. ప్రతీ కార్యకర్త పార్టీని అభివృద్ధి చేసేందకు అహర్నిశలు కృషిచేయాలని సూచించిన రేవంత్.. మోసం చస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తను పీసీసీ బాధ్యతలు తీసుకున్ననాడే హెచ్చరించారు.
-మొదటి నుంచి దూకుడే..
రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగాలనే వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. చిన్నతనం నుంచి లీడర్ షిప్ లక్షణాలు కలిగి ఉన్న ఈ ఫైర్ బ్రాండ్.. మాటల తూటాలతో ప్రత్యర్థిని పరేషాన్లో పడేయడంలో దిట్ట. రేవంత్ ది మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి. 1969లో జన్మించిన ఈయన..ఉస్మానియాలో డిగ్రీ పూర్తిచేశారు. మొదట ఏబీవీపీలో పనిచేసిన ఆయన అప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1992లో జయపాల్ రెడ్డి సోదరుడి కూతురు గీతను ప్రేమ వివాహం చేసుకున్నారు. తరువాత టీఆర్ఎస్ లో చేరిన ఆయన.. గులాబీ పార్టీలోనూ చురుగ్గా పనిచేశారు. 2004 ఎన్నికల సందర్భంగా కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు నేపథ్యంలో టికెట్ రాలేదు. పార్టీకి రాజీనామా చేసి 2006లో ఇండిపెండెంట్ గా జడ్పీటీసీగా గెలిచారు.. 2008లో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు.ఇతడి దూకుడును చూసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఆహ్వానించారు. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. 2014లో మరోసారి విజయం సాధించి.. అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఎదిగారు.. అసెంబ్లీలో మాటల తూటాలతో అధికార టీఆర్ఎస్ పార్టికి ముచ్చెమటలు పట్టించారు. తరువాత టీడీపీ కనుమరుగు అవుతున్నా.. ఒంటరిగా పోరాడిన ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారు. కొద్దిరోజులు స్తబ్ధుగా ఉండి.. 2017 అక్టోబర్ 25న టీడీపీకి రాజీనామా చేశారు. తరువాత రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. 2018 ఎన్నికల్లో కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.. తరువాత మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంటులో అడుగుపెట్టారు.
– రెండేళ్లలో టీపీసీసీ పీఠం..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంవత్సర కాలంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమయ్యారు. అయితే వచ్చిన ఏడాదిలోనే రేవంత్ కు ఉన్నత పదవిని కట్టబెట్టడం అనేది కొందరు సీనియర్లకు నచ్చలేదు. దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఈ విషయంలో గాంధీ భవన్ లో కోల్డ్ వార్ కూడా జరిగింది. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన.. సీనియర్ల స్థానంలో యువతరానికి అవకాశం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ ఆలోచనలో రేవంత్ రెడ్డి 2021 జూలై మాసంలో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ విషయంలోనూ కాంగ్రెస్ పెద్దలు చాలా మంది వ్యతిరేకించారు. అప్పుడు ప్రారంభమైన అంతర్గత పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. తన వర్గానికే చెందిన కొమటిరెడ్డి లాంటి నాయకులు రేవంత్ పై ఇప్పటికీ అలక పూనుకున్నారు.
-ఒంటరిపోరులో.. లక్ష్యం ఛేదించేనా..?
ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ పై హస్తం సీనియర్లు అందరూ చాలా గుర్రుగా ఉన్నారు. అయితే అవేమీ పట్టించుకోని రేవంత్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. పదవి స్వీకరించిన కొద్దిరోజులకే టీఆర్ఎస్ ముఖ్యనాయకులపై మాటల తూటాలు పేల్చడం ప్రారంభించారు. డ్రగ్స్ కేసులో నేరుగా మంత్రి కేటీఆర్ పైనే ఆరోపణలు చేయగా.. అతనూ గట్టిగానే స్పందించిన సందర్భాలు ఉన్నాయి. తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. సీనియర్లు కలిసిరాకున్నా.. కార్యకర్తలు.. కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో రేవంత్ తనదైన శైలిలో ప్రభుత్వంపై ప్రతిదాడికి దిగుతున్నారు.
-టార్గెట్.. 2023
రేవంత్ రెడ్డి 2023 ఎన్నికలు లక్ష్యంగానే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలిస్తే సీఎం పదవి తనదే అని చెప్పుకోకపోయినా.. ఆ కోరిక అతడిలో బలంగా ఉంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిన పెట్టి.. వచ్చే సార్వత్రిక ఎన్నిక సమయానికి ప్రజల్లో కలిసిపోవాలన్నది రేవంత్ టార్గెట్. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. నిత్యం సభలు.. సమావేశాలతో రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి నుంచి భూపాలపల్లి జిల్లా వరకు ముందుగా బడుగు… బలహీనవర్గాలకు దగ్గర కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లోనూ యువతరాన్ని.. తనకు అనుకూలంగా ఉన్న వారికే టికెట్ ఇప్పించేలా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ విద్యార్థి నేత బల్మూరి వెంకట్ కు టికెట్ ఇచ్చి అందరి అంచనాలను తలకిందులు చేశారు రేవంత్.
-కలిసిరాని పెద్దలు.. కార్యకర్తలే బలం..
రేవంత్ కాంగ్రెస్ లోకి ఒంటరిగానే వచ్చారు.. ఇప్పుడూ ఒంటరిగానే పోరాడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. కొందరు పెద్దలు కలిసి వస్తున్నా… అది అయిష్టంగానే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో అందరూ సీనియర్లే.. ఎవరిమాట ఎవరూ వినని పరిస్థితి.. ఈ క్రమంలో రేవంత్ లీడర్లను నమ్మకుండా.. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు.. తనకంటూ ఏర్పాటు చేసుకున్న బలగాన్ని ఇక్కడ వాడుకుంటున్నారన్నది సమాచారం. వచ్చే 2023ఎన్నికల వరకు ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ టీంతో పాటు.. రేవంత్ వర్గాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటుచేసి విజయం సాధించాలని వ్యూహాలు పన్నుతున్నారు.
… అయితే రాజకీయంగా ఒంటరిపోరు.. ఎన్నటికైనా ప్రమాదమే. తన చుట్టూ ఉండే నాయకులే బలం ఇవ్వని తరుణంలో రేవంత్ సీఎం కుర్చిని అధిరోహిస్తాడన్నది కత్తిమీద సాము వ్యవహారమే.. బలపడుతున్న బీజేపీని ఢీకొడుతూ.. లక్షల మందిసైన్యంతో ఎదురులేని శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తూ… రేవంత్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కష్టసాధ్యం. అయితే రేవంత్ రాజకీయ జీవితంలో ఒంటరి పోరాటంతోనే ఎక్కువ విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అదే సెంటిమెంటు కలిసి వస్తే.. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర లిఖించినట్లు అవుతుంది. చూడాలి మరీ.. రేవంత్ రెడ్డి రాజకీయ ‘హస్త’వాసి ఇప్పుడైనా కలిసి వస్తుందా అని…
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Will congress come to power with rewanth reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com