AP Congress: ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపుగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నది. కర్ణాటకలో ఘన విజయం సాధించిన తరువాత దక్షిణాదిలోని మరిన్ని రాష్ట్రాలపై కన్నేసినట్లు తెలుస్తుంది. త్వరంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణాలో కొద్దో గొప్పో ప్రభావం చూపుతున్నా, ఏపీలో ఆ పార్టీకి నాయకత్వ లేమి వెంటాడుతోంది. అధికారం కోల్పోయాక చాలా మంది జారుకోగా, మరికొంత మంది పార్టీ ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో ఇక్కడ కూడా బలపడతామని చెబుతున్న ఆ పార్టీ అధిష్టానం వ్యూహమేమిటనేది చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల్లో వరుస ఓటములు చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనీసం ఓటు బ్యాంకును కోల్పోయింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసింది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అస్సలు లేదు. రాష్ట్ర విభజన పాపం ఇంకా కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని భుజాన వేసుకోకపోగా, సైలెంటుగా ఉండిపోయారు. ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రఘువీరా రెడ్డికి అప్పగించింది. ఆయన తరువాత ప్రస్తుతం గిడుగు రుద్రరాజు ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తున్న తరుణంలో కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సత్ఫలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ అని తేల్చి చెప్పారు. కేంద్రంలో ప్రభావం కోల్పోతున్న బీజేపీతో ఆ పార్టీలు జతకట్టడాన్ని తప్పుబట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక ఎన్నికలు కొత్త మార్పును సూచిస్తున్నాయన్నారు.
ఏపీలో ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ చేస్తామని మాజీ ఎంపీ ఎంపీ చింతామోహన్ వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే తొలి రెండున్నరేళ్లు ఎస్సీలకు, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాపులకు సీఎం పదవి ఇస్తామంటూ ప్రకటించారు. రాబోవు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. తటస్థులను కాంగ్రెస్ వైపు మరల్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంత మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.