Janasena Vs YCP: అతి తక్కువ కాలంలో ఏపీలో జనాదరణ పొందిన పార్టీ జనసేన. రాబోవు ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నట్లు చెబుతున్న పవన్ కల్యాణ్ ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించారు. దుందుడుకుగా ముందుకు వెళ్తున్న ఆయనను నిలువరించేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, ప్రత్యర్థులపైనే కన్నేసిన ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై దృష్టి పెట్టకపోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం జనసేన సింబల్ కోల్పోవడం రాష్ట్రంలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. హాట్ టాపిగ్గా మారింది.
2014లో పార్టీ పెట్టిన పవన్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీజేపీ, టీడీపీ కూటమి మద్దతు ఇచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలని వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత 2019లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేశారు. ఒక్క సీటు గెలుచుకున్నప్పటికీ ఓటింగ్ శాతాన్ని అంచనా వేసుకున్నారు. పార్టీ సింబల్ గా గాజు గ్లాసు గుర్తును ఎంచుకున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృతకృత్యులయ్యారు. ఆ తరువాత 2024 ఎన్నికలే ధ్యేయంగా ప్రణాళిక వేసుకున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు జనసేనను బాగా టార్గెట్ చేశారు. తదనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీకి జై కొట్టారు. పొత్తు పొట్టుకొని కేంద్రంతో కలిసి పనిచేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా తెర వెనుక జరుగుతున్న పరిణామాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ ను బలహీనం చేసేలా ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆయన మొదటి నుంచి అంటున్నారు. రాబోవు ఎన్నికల్లో ‘‘కీ’’ రోల్ లా మారకుండా కేంద్రమే అడ్డుపడుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ పార్టీకి జవసత్వాలు లేకుండా చేస్తే రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కాకుండా జనసేన వైపు చూసే నాయకులు బీజేపీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో స్వతహాగా బలపడాలని చూస్తుంది. జనసేన ఇతోధికంగా తోడ్పాటునందిస్తున్నా, ఆ పార్టీ పెద్దలు పెద్దగా నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. పొత్తు పెట్టుకుంటే రాష్ర్టంలోని ఏ పార్టీ అయినా, బీజేపీతోనే జత కట్టే అవకాశం ఉంది. ఆ మేరకు బీజేపీ పెద్దల ప్లాన్ గా పలువురు చెబుతున్నారు. ఇదంతా తెర వెనుక వైసీపీ చేస్తుందా అన్న అనుమానాలూ రేకెత్తిస్తున్నాయి. కాపులను జనసేనకు, బీజేపీకి మధ్య చీల్చే ఎత్తుగడను అవలంభిస్తోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఎదిగే వాళ్లను తొక్కేయడం ఏమిటని పలువురు నిట్టూరుస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ జనసేనకు ఇచ్చే సింబల్ ప్రజల్లోకి తీసుకెళ్లి, తన సత్తా చాటేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.