Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు గత 19 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బందీగా ఉన్నారు. ఏసీబీ కోర్టుతోపాటు హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ఈ తరుణంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.అక్కడ సానుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ప్రతికూల తీర్పు వస్తే మరికొన్ని రోజులు పాటు ఆయన రిమాండ్ లో ఉండాల్సిన అనివార్య పరిస్థితి.
చంద్రబాబుపై ఎన్ని కేసులు నమోదయినా… ఆయన్ను ఎవరు ఏమి చేయలేరు అనేది నిన్నటి మాట. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో జగన్ చేసి చూపించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేశారు. జైల్లో పెట్టడమే కాదు రోజుల తరబడి రిమాండ్ కొనసాగేలా పట్టు బిగించారు. చంద్రబాబు సైతం అదే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముందుగా తనపై ఉన్న కేసులను కొట్టేయడం పై ఫోకస్ పెట్టారు. అందుకే సుప్రీంకోర్టు వరకు ఆశ్రయించారు. అక్కడ సానుకూలత వస్తే పర్వాలేదు.. లేకుంటే మాత్రం బెయిల్ కి ప్రయత్నిస్తారు. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గురైంది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు. అదే సమయంలో ఏసీబీ కోర్టులో సైతం బెయిల్ కి ప్రయత్నిస్తున్నారు.
సుప్రీంకోర్టులో సానుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. ఒకవేళ విచారణ వాయిదా పడినా, ప్రతికూల తీర్పు వచ్చినా అక్టోబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. అయితే గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. అసలు చంద్రబాబును అరెస్టు చేయగలరా అని భావించారు. కానీ అరెస్టు చేయడమే కాదు.. దాదాపు మూడు వారాలపాటు రిమాండ్ విధించగలిగారు. జైలులో పెట్టగలిగారు. కేసులు మీద కేసులు పెడుతున్నారు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
అయితే చంద్రబాబు అంతటి ప్రతికూల పరిస్థితులునైనా ఎదుర్కొనగలరు. అందుకే ఆయన ఈ కేసుల్లో బెయిల్ గురించి కాకుండా కేసు కొట్టివేతకే ఎక్కువగా తాపత్రయపడుతున్నారు. అందుకే ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ.. క్వాష్ పిటిషన్లను వేస్తూ వచ్చారు. కింది కోర్టుల్లో ఎప్పటికప్పుడు కొట్టివేతలకు గురవుతున్నా వెనక్కి తగ్గలేదు. బెయిల్ కంటే కేసుల కొట్టివేత వైపే మొగ్గు చూపుతున్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం చంద్రబాబు అరెస్టులో నిబంధనలు పాటించలేదని ఆయన తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు కచ్చితంగా 17 ఏ ను పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నారు. గతంలో యడ్యూరప్ప కేసులో సైతం ఈ సెక్షన్ ను పరిగణలో తీసుకొని తీర్పు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కేసు విషయంలో సైతం అదే జరుగుతుందని ఆయన తరపు న్యాయవాదులు బలంగా విశ్వసిస్తున్నారు.