Best Tourism Award: పెంబర్తి.. ఈ ఊరు కుర్రకారుకు పరిచయం ఉండే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. వర్షం సినిమా చూసిన కుర్రకారు ఈజీగా గుర్తుపడతారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందులోని వర్షం పాటతోపాటు ఆ పాట తీసిన పెంబర్తి కూడా అంతగా గుర్తుండిపోతుంది. అయితే ఈ పెంబర్తికి సినిమాను మించిన గుర్తింపు ఉంది. అవార్డుల తయారీలో ఆ ఊరుకు ప్రత్యేకత ఉంది. హస్తకళలకు పుట్టినిల్లు పెంబర్తి. నంది అవార్డులకు రూపం దిద్దిన ఘనత కూడా ఈ పెబార్తి వాసులదే.. తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుల లోగోపై కాకతీయ తోరణం నమూనా ఉంటుంది. ఏపీ ప్రభుత్వ అవార్డులలో పూర్ణకుంభం, మూడు సింహాల నమూనా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అవార్డులు కానీ ఇతర గొప్పగొప్ప అవార్డులు, భారీ విగ్రహాల తయారీ కూడా ఇక్కడ ఉండే జరుగుతుంది. అంతటి గుర్తింపు ఉన్న ఊరితోపాటు ప్రకృతికి నిలయమైన సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌కు కూడా జాతీయ గుర్తింపు లభించింది.
పర్యాటక పల్లెలుగా అరుదైన గౌరవం..
తెలంగాణలోని రెండు గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సంస్కృతి, హస్తకళలు, ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరైన ఈ రెండూ.. దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకే చెందిన జి.కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శాఖ ఇది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ రూరల్ టూరిజం, రూరల్ హోమ్‌స్టే ఈ మేరకు ఈ రెండింటినీ ఎంపిక చేసింది.
పోటీలో చాలా గ్రామాలు
ఈ కేటగిరీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయి. దీనికి సంబంధించి తమ ఎంట్రీలను పంపించాయి. మొత్తంగా 795 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటన్నింటినీ వడపోసిన అనంతరం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలను ఎంపిక చేసింది. ఈ నెల 27వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ, చంద్లాపూర్, పెంబర్తి గ్రామ పంచాయతీ ప్రతినిధులు ఈ అవార్డులను అందుకోనున్నారు.
కాకతీయుల కాళం నుంచి ప్రసిద్ధి..
పెంబర్తి కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ తయారయ్యే ఇత్తడి, కంచు లోహ కళాకృతులు అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
రంగనాయక స్వామి కొలువైన చంద్లాపూర్..
చంద్లాపూర్‌లో రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండలు, రంగనాయక సాగర్ రిజర్వాయర్.. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ తయారయ్యే గొల్లభామ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తోన్నాయి. ప్రకృతి సౌందర్యం, సంస్కృతి, కళలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు గ్రామాలను అత్యుత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంతి కిషన్‌రెడ్డి తెలిపారు.