Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యం విషయంలోస్పష్టత నివ్వాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది.ఆయన ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తి.ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓ పార్టీ అధినేత కూడా. ఇటువంటి తరుణంలో జరగరానిది జరిగితే.. అది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మూల్యం తప్పదు. వైద్యులు జారీ చేయాల్సిన హెల్త్ బులిటెన్ ను జైలు అధికారులు జారీ చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడే కంటే ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి ఉన్నత స్థాయి వైద్య బృందంతో వైద్య పరీక్షలు చేయించి నివేదిక వెల్లడించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడుతుండడం విచారకరం.
చంద్రబాబు అనారోగ్యానికి గురికావడం స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎక్కువ.. తక్కువగా అన్నదే ఇప్పుడు కీలకము. చంద్రబాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు, టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అంత కాదని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇంట్లో నుంచి వస్తున్న భోజనంతో ఆయన బాగానే ఉన్నారని వైసీపీ నేతలు ఎద్దేవా వచ్చేస్తున్నారు. అసలు వాస్తవం తెలియక ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. చంద్రబాబు పుణ్యమా అని జైలు అధికారులు, కొందరు వైద్యులు సెలబ్రిటీలు గా మారిపోయారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు అనారోగ్య పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జిజిహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదికను తొక్కి పెట్టి.. సొంత వైద్యులను పిలిపించి ఇష్టమైన నివేదికలు ఇప్పిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అనారోగ్యానికి గురైన వెంటనే రాజమండ్రి జిజిహెచ్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత వచ్చి వైద్య పరీక్షలు చేశారు. జైలు అధికారులకు చంద్రబాబు ఆరోగ్యం పై ఒక నివేదిక ఇచ్చారు. అయితే వాటిని తుంగలో తొక్కి డాక్టర్ శివకుమార్ ని తెరపైకి తేవడం విమర్శలకు తావిస్తోంది. జైలు అధికారి రవి కిరణ్ రెడ్డి చంద్రబాబు ఆరోగ్యం పై డాక్టర్ శివకుమార్తో ప్రెస్ మీట్ లో చెప్పించారు. ఇప్పుడున్న వాతావరణం లో అందరికీ డిహైడ్రేషన్ కామన్. చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సిన అవసరమే లేదని ఆయన చెప్పుకొచ్చారు. మరి జిజిహెచ్ వైద్యాధికారులు ఇచ్చిన నివేదిక గురించి విలేకరులు ప్రస్తావిస్తే దానిని బయట పెట్టాల్సిన పనిలేదని.. కోర్టుకు సబ్మిట్ చేస్తామని డాక్టర్ శివకుమార్ చెప్పడం విశేషం.
డాక్టర్ శివకుమార్ ఒక వైద్యుడిగా కాకుండా వైసిపి నేతల మాట్లాడడం చూసి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారని.. యాక్టివ్గానే ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు కి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవా అంటే మాత్రం.. శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. చల్లటి వాతావరణం లో ఉంచమని జైలు అధికారులకు సిఫారసు చేసామని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలులో ములాఖత్ సమయంలోనే జి జి హెచ్ వైద్యుల నివేదిక గురించి లోకేష్ అడుగగా.. జైలర్ రవి కిరణ్ రెడ్డి నిర్లక్ష్యంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అటు జైలర్ వ్యవహార శైలి, ఇటు వైద్యుడి నోటి నుంచి వచ్చిన మాటలు ప్రో వైసిపి మాదిరిగా ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం మొదరకముందే ప్రభుత్వం ఉన్నత స్థాయి వైద్య బృందాన్ని పంపించి నివేదికను బహిర్గత పరిస్తే సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకుంటే మాత్రం ఈ వివాదం ఇలానే కొనసాగుతుంది.