కెసిఆర్ గారూ, మరీ ఇంత పచ్చి అబద్దాలా?

కెసిఆర్ గారు తను చెప్పాలనుకున్నది ప్రజల్ని మంత్ర ముగ్ధుల్ని చేసి నిజమని నమ్మించగలరు. ఆ మాటల గారడిలో ఆయనకు దేశంలో ఎవరూ సాటిరారు. ఈ మాటల చాతుర్యం కెసిఆర్ లాంటి   రాజకీయనాయకుల చేతిలో బ్రహ్మాస్త్రం కన్నా భ్రమింప చేసే అస్త్రంగా మారుతుంది. అసలు విద్యుత్తు సంస్కరణలు మొదట్నుంచీ రాజకీయాలకు బలవుతూనే వస్తున్నాయి. ఇందులో విద్యుత్తు ఉద్యోగుల పాత్ర కూడా ప్రధానంగా వుంది. ముందుగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలుగా విడదీయటాన్ని కొన్నేళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రపంచం మొత్తం […]

Written By: Ram, Updated On : September 16, 2020 10:35 am
Follow us on


కెసిఆర్ గారు తను చెప్పాలనుకున్నది ప్రజల్ని మంత్ర ముగ్ధుల్ని చేసి నిజమని నమ్మించగలరు. ఆ మాటల గారడిలో ఆయనకు దేశంలో ఎవరూ సాటిరారు. ఈ మాటల చాతుర్యం కెసిఆర్ లాంటి   రాజకీయనాయకుల చేతిలో బ్రహ్మాస్త్రం కన్నా భ్రమింప చేసే అస్త్రంగా మారుతుంది. అసలు విద్యుత్తు సంస్కరణలు మొదట్నుంచీ రాజకీయాలకు బలవుతూనే వస్తున్నాయి. ఇందులో విద్యుత్తు ఉద్యోగుల పాత్ర కూడా ప్రధానంగా వుంది. ముందుగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలుగా విడదీయటాన్ని కొన్నేళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రపంచం మొత్తం ఒకదారయితే మనది వేరే దారి. ఏ సంస్కరణలు చేపట్టాలన్నా ఎప్పుడూ ప్రతిబంధకాలే. అదేసమయం లో వున్న వ్యవస్థ కుదేలయి అచేతనా స్థితి కి వెళ్తున్నా దాన్నే పట్టుకొని వేళ్ళాడటం మనకు అలవాటయ్యింది. మేధావులు, మీడియా కూడా ఇందులో  పాత్రధారులే. ఎటువంటి మార్పునీ ఆహ్వానించే పరిస్థితిల్లో వుండరు. విద్యుత్తు సంస్కరణలనే తీసుకుందాం. మూడు ప్రత్యేక కార్పోరేషన్లు గా విభజించటానికి రెండు దశాబ్దాలు తీసుకుందంటే మన దేశంలో ఏదయినా అమలు చేయాలంటే ఎంత కష్టమో అర్ధమవుతుంది.

Also Read : ఇద్దరు సీఎంలను టార్గెట్‌ చేసిన కొండా సురేఖ

కెసిఆర్ గారు చెప్పేదాంట్లో నిజమెంత?

కెసిఆర్ గారు నిన్న అసెంబ్లీ లో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు ఎంత ప్రమాదకారో తన స్టైల్ లో వివరించి ఏకంగా అసెంబ్లీ లో ఈ ప్రతిపాదిత బిల్లుని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో తీర్మానం పెట్టి ఆమోదింప చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, మజ్లీస్ కూడా ఇందులో భాగస్వామ్య మయ్యాయి. ఆయన చెప్పిన విషయాలు ఒక్కొక్కటి ఎంత పచ్చి అబద్దాలో ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా లోడ్ డిస్పాచ్ గురించి తను చెప్పింది ఎంత అబద్దమో చూద్దాం. ప్రస్తుతం తమ దగ్గరున్న లోడ్ డిస్పాచ్ కేంద్రం లాగేసుకొని చిన్న రిపేర్లకు కూడా డిల్లీ కి మొరపెట్టుకోవాలని. అసలు ఇందులో ఏమయినా నిజముందా? నీ దగ్గర రిపేర్లకు కేంద్రానికి సంబంధమేంటి? లోడ్ డిస్పాచ్ అంటే అలా ప్రజలకు అర్ధమవ్వాలా? నీ దగ్గర పంపిణీ సమస్యలు కేంద్రం ఎందుకు అజమాయిషీ చేస్తుంది? అలా అని ఆ బిల్లు లో ఉందా? ఎందుకు ఇలా మోసం చేస్తారు? దేశం మొత్తం ఒకటే పవర్ గ్రిడ్ అయ్యిందని మరిచిపోయారా? అంతమాత్రాన మీ విద్యుత్తు పంపిణీ మీ చేతుల్లోనే ఉంటుందని మీకూ తెలుసు కెసిఆర్ గారూ. లోడ్ డిస్పాచ్ కి మసాలా జోడించి ప్రజలకి ఉన్నదీ లేనిదీ కలగలిపి ఇదేదో రాష్ట్ర హక్కుల్ని హరించినట్లు చెబితే ఎలా?

పంపిణీ సంస్థలు కునారిల్లుతున్న మాట నిజం కాదా? మన తెలంగాణా లో పరిస్థితి ఏమన్నా భిన్నంగా ఉందా? వాటికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించక వాటిని ఆర్ధికంగా కుంగదీస్తుంది మీరు కాదా? దేశం లో అన్ని పంపిణీ సంస్థలు ఏవో కొన్ని మినహా ( ఆ మినహాయింపు లో తెలంగాణా లేదు కదా) ఆర్ధిక దివాలా లో వున్న మాట వాస్తవం కాదా? కేంద్రం ఈ బిల్లు లో ఏమి చెబుతుంది? ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థలు ఎలా ఆర్ధిక స్వయం సమృద్ధి సాధించవచ్చో చెప్పింది. ఉత్పత్తి సంస్థలకు సంవత్సరాల తరబడి పంపిణీ సంస్థలు బకాయీలు పడటం నిజం కాదా? మరి ఆ ఉత్పత్తి సంస్థలు దానివలన బ్యాంకులకు సకాలం లో అప్పులు చెల్లించలేక అటు బ్యాంకులు, ఇటు ఉత్పత్తి సంస్థలు ఇబ్బందుల్లోకి కూరుకు పోవటం నిజమా కాదా? అందులో మీరు నిర్వహించే పంపిణీ సంస్థలు ఉన్నాయా లేవా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. పంపిణీ సంస్థల నిర్వహణ అధ్వానంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలనేలే నాయకులు కారణం కాదా? మీరెప్పుడైనా సకాలం లో పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయీలు ( సబ్సిడీ పరిహారం గానీ, ఇతరత్రా బాకీలుగానీ ) చెల్లించారా? ఎందుకు చెల్లించలేదు? అసలు మీకు విద్యుత్తు సంస్కరణల పై మాట్లాడే హక్కు లేదు. పంపిణీ సంస్థలు ఈ స్థితి కి చేరటానికి మీరూ కారణమే అయినప్పుడు ఈ నంగనాచి కబుర్లెందుకు? మీ తప్పిదాల్ని కప్పి పుచ్చుకోవటానికి కేంద్రం పై నిందలా? కేంద్రం అన్నీ మంచే చేస్తుందని నేను చెప్పను. కానీ ఇప్పుడు సందర్భం అసెంబ్లీ లో మీ మోసపూరిత మాటల గురించి మాత్రమే.

Also Read : తెలంగాణలో స్కూళ్లు తెరిచేది ఎప్పుడంటే?

మీ అబద్ధాలకు అంతు లేదా కెసిఆర్ గారూ?

కేంద్ర బిల్లు చెప్పిందేమిటి మీరు దాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు? కేంద్రం ఏ రోజు రైతులకు సబ్సిడీ లు ఇవ్వొద్దని చెప్పలేదు. అలా ఆ బిల్లులో లేదు. చెప్పిందల్లా నిర్వహణ ఓ పద్దతిలో, సమర్ధవంతంగా వుండాలని మాత్రమే. నువ్వు సబ్సిడీ ఇస్తానంటే ఇవ్వు. కానీ సబ్సిడీ ని ఉదారంగా ప్రకటించి పంపిణీ సంస్థలపై ఆ భారం మోపటం ఈ బిల్లు వచ్చిన తర్వాత కుదరదు. ఇది తప్పా కెసిఆర్ గారూ. ప్రపంచ దేశాల విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎలా పని చేస్తున్నాయో ఒక్కసారి పరిశీలించండి. విద్యుత్తు పంపిణీ కి ఎంత ఖర్చయ్యిందో లెక్క తేల్చి ఒక్కో యూనిట్ కి టారిఫ్ నిర్ణయిస్తారు. అది పారిశ్రామిక సంస్థ కైనా, వ్యాపార సంస్థ కైనా, వ్యక్తిగత వినిమయదారుడి కైనా ఒకటే. తర్వాత ప్రభుత్వం ఏ వర్గాలకు సబ్సిడీ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు ప్రత్యక్షంగా ఇస్తుంది. దీనివలన పంపిణీ సంస్థలు ఆర్ధికంగా నిలదోక్కుకుంటాయి. ఇది తప్పేలా అవుతుంది? అలాగే ‘ఓపెన్ యాక్సెస్’ వ్యవస్థ ని తప్పు పట్టావు. అదేమంటే ఈ బిల్లు పాసయితే నా పంపిణీ సంస్థ నుంచి తీసుకోకుండా వేరే సంస్థ నుంచి తీసుకుంటే మా పరిస్థితి ఏంటి అని అంటున్నావు. అదెలా తప్పో చెప్పాలి. ఇప్పుడు నాకు మొబైల్ ఫోన్ మార్కెట్ లో ఏది తక్కువ ధరకి వస్తే అది తీసుకుంటున్నాను. ఇదీ అంతే కెసిఆర్ గారూ. మీకన్నా ఇంకొకరు తక్కువకి కరెంట్ ఇస్తానంటే కాదు నష్టపోయినా పర్వాలేదు మీ దగ్గరే కొనాలంటారా? ఇదెక్కడి న్యాయం? వినిమయదారుడు ఎక్కడ చౌకగా దొరికితే మార్కెట్ లో అక్కడ కొనుక్కుంటాడు. మీ పంపిణీ సంస్థలు మార్కెటు లో పోటీలో తక్కువ ధరకు , నాణ్యమైన విద్యుత్తు ను సరఫరా చేయగలిగితే మీ దగ్గరే కొంటాడు. లేనిపోని పుకార్లతో కేంద్రం పై విరుచుకుపడే బదులు మీ పంపిణీ సంస్థలు సమర్ధవంతంగా నిర్వహించటం పై దృష్టి పెట్టండి. అది మీరు చేయాల్సిన పని.

ఇక పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ పై లేనిపోని అబద్దాలు చెప్పారు. మీ పంపిణీ సంస్థలో ఏదైనా భాగాన్ని సబ్ లీజ్ కి ఇవ్వటాన్ని భూతద్దం లో పెట్టి చూపించారు. మీ పంపిణీ సంస్థ మీ ఇష్టం. బిల్లులో ఎక్కడా మీరు ఖచ్చితంగా ప్రైవేటు వాళ్ళకు సబ్ లీజు కి ఇవ్వాలని ఉందా? అది ఎనేబ్లింగ్ క్లాజ్. ఏదైనా రాష్ట్రం చేయాలనుకుంటే వాళ్ళకు స్వేచ్చ వుంటుంది. అంతేగానీ మీరు వద్దనుకుంటే కాదు చెయ్యాలని ఎవరూ చెప్పరు కదా. బిల్లు లో లేనిదాన్ని ఉందన్నట్లు గా భ్రమింప చేయటం లో మీకు మీరే సాటి. అయినా నాకు చిన్న సందేహం. అసలు ప్రైవేటీకరణ అనేదే తప్పులాగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం కలిసి సహజీవనం చేయకుండా ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో బతికి బట్ట కడుతుందా? డిల్లీ లో మొత్తం విద్యుత్తు ప్రైవేటు సంస్థల అధీనం లోనే వుంది. కానీ అక్కడ మిగతా రాష్ట్రాల కన్నా తక్కువ రేటుకే వినిమయదారుడికి కరెంటు సరఫరా చేస్తున్నారు, అదీ నాణ్యమైన విద్యుత్తు. ప్రైవేటా, ప్రభుత్వ రంగమా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. కావాల్సింది ప్రభుత్వమా, ప్రైవేటా కాదు. పోటీ వుండటం. ఎక్కువమంది పోటీదారులు రంగం లో వుంటే వినిమయదారుడుకి తక్కువ ధరకి , నాణ్యమైన విద్యుత్తు లభ్యమవుతుంది. ఇది మార్కెట్ సూత్రం కెసిఆర్ గారూ.

విద్యుత్తు మీటర్ల పై లేనిపోని రాద్ధాంతం 

అవును బిల్లులో ఖర్చయ్యే కరెంటు కి లెక్క వుండాలని చెప్పింది, ఇందులో తప్పేముంది. విద్యుత్తు సమస్యలు ఒక్కో రాష్ట్రం లో ఒక్కో లాగా వున్నాయి. ఇటీవలివరకు ఉత్తర ప్రదేశ్ లో వాడే విద్యుత్తు కి కట్టే బిల్లులకు సంబంధమే వుండేది కాదు. స్మార్ట్ మీటర్లు పెట్టటంతో ఖర్చేంతో తెలుస్తుంది. అంతమాత్రాన మిమ్మల్ని ఉచిత విద్యుత్తు ఇవ్వోద్దనలేదు కెసిఆర్ గారూ. నిర్వహణ సమర్ధం గా ఉండాలంటే జమా ఖర్చులు ఖచ్చితంగా వుండాలి. మీరు ఎన్ని వర్గాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలనుకుంటే అంతమందికి ఇవ్వండి. అది మీ ఇష్టం. ఇప్పుడు ఎన్ని సంక్షేమ పధకాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్చగా ఇవ్వటం లేదు , ఇది కూడా అంతే . ఉచిత విద్యుత్తు సంక్షేమ పధకంగా కొనసాగించండి. చిక్కల్లా ఎక్కడంటే దానికయ్యే ఖర్చు మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు చెల్లించాల్సి వుంటుంది. అది మీ కిష్టం లేదు. పంపిణీ సంస్థలపై పెత్తనం చేసి ఆ డబ్బులు వాటికి సరిగ్గా ఇవ్వకుండా వాటిని ఆర్ధిక ఇబ్బందుల్లోకి పడేస్తున్నారు. ఈ బిల్లు పాసయితే మీకా అవకాశం వుండదు. మనసులో మాట డైరెక్టుగా చెప్పకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించటం ఎందుకు? మీటర్లు పెడితే తిరిగి బిల్లు కలెక్టర్లు వస్తారని చెప్పి వాళ్ళను భయ భ్రాంతుల్ని చెయ్యటం వెనక మీ అంతర్యమేంటి? ఒకవైపు ఆధునిక సాంకేతికత తో ఎక్కడికీ వెళ్ళకుండా ఆఫీస్ లో కూర్చొని మీటర్ రీడింగ్ తీసుకొనే వ్యవస్థ రాబోతుంటే పాత కాలపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయొద్దు కెసిఆర్ గారూ. ఇప్పటికైనా మీ కల్లబొల్లి మాటలు, లేనిపోని పుకార్లు ఆపి బిల్లు కి సహకరించి దేశవ్యాప్తంగా చౌక విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందుబాటులోకి రావటానికి సహకరించండి.  పంపిణీ సంస్థలు సమర్ధవంతంగా పనిచేయటానికి సహకరించండి. ఆధునిక సమాచార వ్యవస్థలో    పుక్కిటి పురాణాలు వినే రోజులు పోయాయని గమనించండి కెసిఆర్ గారూ.

Also Read : తెలంగాణ యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ?