‘కోతి పుండు బ్రహ్మ రాక్షసి’ అంటారు. సరిగ్గా ఇప్పుడు జగన్ పాలనలో కూడా అదే జరుగుతోంది. మొన్నటి దాకా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించిన జగన్ సర్కార్ ఇప్పుడు మాట మార్చింది. ఇన్నాళ్లు కావాలనే అలా చేసిందా..? లేక ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా..? తెలియకుండా ఉంది.
Also Read: పవన్ కు అవమానం.. పోలీస్ గడపతొక్కిన జనసేన
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతిని రాజధానికి ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధానిలో భూములు చేతులు మారాయని, దందాలు జరిగాయని జగన్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నడిపించారని అన్నారు. కానీ.. అక్కడ అందరూ రాజకీయ నేతలే కొనుగోలు చేశారా..? ఆ భూముల్లో రైతులు లేరా..? ఏదీ కన్‌ఫాం చేసుకోకుండా అక్కడ అసలు రైతులే లేని మాట్లాడితే ఎలా..? ఇవేవీ పట్టించుకోకుండా జగన్ ఇప్పటివరకు తన మొండి వైఖరితో ముందుకెళ్లారు. ఎప్పుడైతే మూడు రాజధానులు ప్రకటించారో అప్పటి నుంచి అమరావతి రాజధాని ఉద్యమం మొదలైంది. ఇప్పటివరకు ఆ రైతులను ప్రభుత్వం గుర్తించ లేదు. ఇప్పుడు ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రభుత్వం కళ్లు తెరిచింది. రైతులతో చర్చలకు రెడీ అవుతోందనే సంకేతాలు వస్తున్నాయి.
ప్రభుత్వం అంటేనే ప్రజాపక్షం. ఎవరి పట్ల భేదాభిప్రాయాలు చూపకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ.. సమానంగా పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం నడుచుకోవాలి. పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి. కానీ.. జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి రైతుల విషయంలో చిన్న చూపు చూశారు. నిజానికి రాజధాని ప్రాంతంలోనూ జనం వైసీపీకే ఓట్లు వేశారు. జగన్‌కే జై కొట్టారు. అయితే.. మూడు రాజధానుల విషయంలోనూ ముందుగా అక్కడి రైతులతో చర్చించి.. తర్వాతి పరిణామాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాకాకుండా ఆకస్మాత్తుగా మూడు రాజధానుల నిర్ణయం చేశారు. ఇన్నాళ్లు రాజధాని తమ భూములకు సమీపంలో ఏర్పాటు కాబోతోందని సంబరపడ్డ రైతుల ఆశలు అడియాసలయ్యాయి.
Also Read: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి కేంద్రం హామీ
ఇక వైసీపీ మంత్రి కొడాలి నాని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. రాజకీయ నేతలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండాలి తప్ప.. బ్లాక్ రాజకీయాలకు పాల్పడితే వారికి పుట్టగతులుండవ్. అలాంటి వారిని ప్రజలు ఎంతో మందిని చూస్తూనే ఉంటారు. ‘మీకు శాసన రాజధాని కూడా ఉండదని నాని బెదిరిస్తుండడం పుండు మీద కారం చల్లినట్లే. అలాంటి బెదిరింపులు కాకుండా వారికి నచ్చచెప్పి దారికి తీసుకురావాలి. మరోవైపు నానినే తాము చర్చలకు సిద్ధమని అంటున్నా.. ఆచరణలో ఎక్కడా చూపడం లేదు. అందుకే జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా మంత్రి వర్గ కమిటీని వేసి రైతుల వద్దకు పంపించాలి. ఎంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపితే అంత వేగంగా జగన్ సర్కార్ మూడు రాజధానుల కథ సుఖాంతం అవుతుంది.