Margadarsi Case: మార్గదర్శి కేసుల్లో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. సిఐడి ద్వారా పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడా మార్గదర్శి యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదు. ఈ కేసులో ఏ 1 గా ఉన్న రామోజీరావు, ఏ 2 గా ఉన్న శైలజా కిరణ్ లకు మినహాయింపులు లభిస్తున్నాయి. వారు సీఐడీ విచారణకు హాజరవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. సిఐడి నోటీసులు ఇవ్వడమే తప్ప.. వారి హాజరు కానీ.. వారి వివరణ కానీ ఇచ్చిన పరిస్థితులు లేవు.
ఈనెల 18న గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణ హాజరుకావాలని రామోజీరావు తో పాటు శైలజా కిరణ్ లకు సిఐడి నోటీసులు ఇచ్చింది. కానీ వారిద్దరూ విచారణకు హాజరు కాలేదు. తిరిగి ఏపీ సిఐడి అధికారులే కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా రామోజీరావుకు లుక్ అవుట్ సర్కులర్ ఇవ్వడంపై కోర్టు తప్పు పట్టింది. దీంతో ఈ కేసులో సిఐడి అధికారులకు ఝలక్ తగిలినట్లు అయ్యింది.
ఇప్పటివరకు మార్గదర్శికి సంబంధించి 1035 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. అయితే అంతకుముందే మార్చి 21న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మార్గదర్శి యాజమాన్యం పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే అటు తరువాత ఆస్తులను అటాచ్ చేయడంతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ తెలంగాణ హైకోర్టుకు మరోసారి ఆశ్రయించారు. దీంతో కోర్టు ఏపీ సిఐడి అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు అదనపు ఎస్పీలు రాజశేఖర్ రావు, రవికుమార్ లు హాజరయ్యారు. సిఐడి అదనపు డీజీ సంజయ్ కు గుండె ఆపరేషన్ జరిగినందున రాలేకపోయారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో లుక్ అవుట్ సర్క్యులర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సర్కులర్ ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. తమ వాదనను వినిపించేందుకు సమయం కావాలని వారు అడిగారు. దీంతో కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 15 కు వాయిదా వేసింది. మొత్తానికైతే మార్గదర్శి కేసుల వ్యవహారంలో యాజమాన్యానికి ఎప్పటికప్పుడు మినహాయింపులు లభిస్తుండడం విశేషం. ఆస్తుల అటాచ్, కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు, సిబ్బందిపై కేసులు నమోదు చేస్తున్నా రామోజీరావు అండ్ కో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.