https://oktelugu.com/

CM KCR: కెసిఆర్ సంచలన నిర్ణయం: ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో?

భారత రాష్ట్ర సమితి ఈసారి 25 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని తెలుస్తోంది. వీరిలో పూర్వం వరంగల్ జిల్లాలో అత్యంత వివాదాస్పదలుగా ముద్రపడిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య

Written By: , Updated On : August 19, 2023 / 03:18 PM IST
CM KCR

CM KCR

Follow us on

CM KCR: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రేపో మాపో జాబితా అంటూ మీడియాకు లీకులు ఇస్తూనే తెర వెనుక ఫ్లాష్ సర్వే చేస్తోంది. అయితే ఈ సర్వేలో ప్రజాభిప్రాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నది. నియోజకవర్గాల్లో అసంతృప్తిని మూట కట్టుకున్న వారితో పాటు ప్రజల్లో పట్టు సాధించని వారిని పక్కన పెట్టాలని, సమర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మేరకు ఇప్పటికే ఎంపిక ప్రక్రియను 98% దాకా పూర్తి చేసినా.. మళ్ళీ ఒకసారి పరిస్థితులను నిర్ధారించుకునే పనిలో పడింది. అభ్యర్థులను మార్చాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా గట్టి పోటీ ఇచ్చేవారు ఎవరున్నారు అన్నదానిపై ఫ్లాష్ సర్వేలు చేపడుతుంది. రెండు మూడు రోజుల నుంచి నాలుగు బృందాలను రంగంలోకి దించి బరిలో ఎవరు ఉంటే మేలు జరుగుతుందని దానిపై ప్రజల నాడిని తెలుసుకుంటున్నది.

భారత రాష్ట్ర సమితి ఈసారి 25 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని తెలుస్తోంది. వీరిలో పూర్వం వరంగల్ జిల్లాలో అత్యంత వివాదాస్పదలుగా ముద్రపడిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ని తప్పించి కడియం శ్రీహరి, పల్ల రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కడియం శ్రీహరికి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఫోన్ చేసి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఉప్పల్ అభ్యర్థి మార్పు మాత్రం ఖాయమే అని తెలుస్తోంది. ఉప్పల్ స్థానంలో లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తామని స్వయంగా కెసిఆర్ హామీ ఇచ్చారు. అతి తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రామ్మోహన్ బెటరా? లక్ష్మారెడ్డి బెటరా? అంశం మీద భారత రాష్ట్ర సమితి ఫ్లాష్ సర్వే నిర్వహిస్తోంది.

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ఎవరికి వారు తమ వారికి టికెట్లు ఇవ్వాలని కోరుతుండడంతో వారు ప్రతిపాదించిన అభ్యర్థుల బలాబలాల పై కూడా అధినేత సర్వేలు చేయిస్తున్నారు. తొలగించే అభ్యర్థులు ఉన్నచోట బలమైన ప్రత్యామ్నాయ అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు. సిట్టింగ్లను తొలగిస్తే అసంతృప్తి వస్తుందా? వస్తే పరిస్థితి ఏంటి? అనే అంశాలు ఫ్లాష్ సర్వే మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ తో ముఖ్యమంత్రి పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ఎవరెవరికి ఉద్వాసన తప్పదో అనే సంకేతాలు కూడా భారత రాష్ట్ర సమితి ఇస్తున్నది. దీంతో వారంతా మళ్ళీ టికెట్ దక్కించుకున్నందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తర్వాత పవర్ హౌస్లుగా ఉన్న కవిత, హరీష్ రావు, కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సుమారు 25 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.