Mynampally Hanumanth Rao
Mynampally Hanumanth Rao: తెలంగాణలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజ్‌గిరి. అసెంబ్లీ నియోజకవర్గం కూడా అయిన మల్కాజ్‌గిరి జనరల్ స్థానం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావు పోటీచేసి విజయం సాధించారు. ఈసారి తనతోపాటు తన కొడుకును కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని హన్మంతరావు సిద్ధమయ్యారు. ఈమేరకు కేసీఆర్‌కు ఇప్పటికే విన్నవించారు. అయితే కేసీఆర్ వారసులకు టికెట్లు లేవని చెప్పారు. కానీ కోరుట్ల స్థానాన్ని మాత్రం వారసుడికి ఇచ్చారు. అక్కడి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్థానంలో ఆయన తనయుడు కల్వకుంట్ల సంజయ్‌ను ప్రకటించారు.
తిట్టిన మైనంపల్లికే మల్కాజ్‌గిరి..
ఇక కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే వేళ తిరుపతిలో ఉన్న మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దైవదర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను మల్కాజ్‌గిరి నుంచి తన తనయుడు మెదక్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్‌రావు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్‌ను తన కీప్‌లా చూస్తున్నాడని విమర్శించారు. హరీశ్‌రావు రబ్బరు చెప్పులు, ట్రంకు పెట్టెతో ఎలా రాజకీయాల్లోకి వచ్చాడో.. ఎలా ఎదిగాడో అన్నీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావు ఓటమికి కృషి చేస్తానన్నారు. అదే సమయంలో తనకు, తన కొడుకుకు బీఆర్‌ఎస్ టికెట్ రాకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించారు.
ఇంత తిట్టినా..
మైనంపల్లి హనుమంతరావు కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. దుర్భాషలాడారు. అయినా కేసీఆర్ వాటిని లెక్కలోకి తీసుకోలేదు. మైనంపల్లికే టికెట్ ఇచ్చారు. అంటే తన కొడుకుకు టికెట్ లేదని మైనంపల్లికి ముందే తెలిసి ఉంటుందని, ఇందుకు హరీశ్‌రావు అడ్డుపుల్ల వేసి ఉంటాడని భావించినట్లు తెలుస్తోంది. అందేకే తిరుపతిలో తీవ్ర పదజాలంతో హరీశ్‌రావుపై మడిపడినట్లు సమాచారం. ఇక మైనంపల్లి వెలమ సామాజికవర్గం కావడంతో తన సామాజికవర్గం అభ్యర్థిని ఇప్పటికిప్పుడు మల్కాజ్‌గిరిలో తయారు చేయడం కష్టం అయినందున ఆయనకే గులాబీ బాస్ టికెట్ ఖరారుచేశారని తెలిసింది.. మరో ప్రచారం ఏమిటంటే.. కేసీఆర్ అండతోనే మైనంపల్లి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈమేరకు బీఆర్‌ఎస్ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.