గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న తిరుపతి లోక్‌సభ సీటు ఉప ఎన్నిక రానే వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ఈ స్థానానికి పోలింగ్ జరగబోతోంది. ఈ సీటును దక్కించుకునేందుకు పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడంతోపాటు భారీ మెజార్టీ సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉండగా.. వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ–జనసేన కూటమి, టీడీపీలు ఆరాటపడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే పార్టీల ముఖ్యనేతలందరూ తిరుపతిలోనే మకాం వేశారు. ఏప్రిల్ 17న పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఒక్కో పార్టీ అభ్యర్థుల బలబలాలు ఎలా ఉన్నాయో చూస్తే..
తిరుపతి పార్లమెంటు ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనాతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. తిరుపతి లోక్‌సభ నుంచి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఒకరికి టిక్కెట్ దక్కవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ.. దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి గురుమూర్తి పేరు తెరమీదికి వచ్చింది. అనుకున్నట్లుగానే వైసీపీ అధిష్టానం డాక్టర్ గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మినే రంగంలోకి దింపాలని నిర్ణయించింది. జనసేనతో కలిసి పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ తామే బరిలో నిలుస్తామని ప్రకటించింది. కానీ.. కూటమి అభ్యర్థిగా రత్నప్రభను పోటీలో నిలిపారు.
కాగా.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి సర్వేపల్లి, గూడూరు (ఎస్సీ రిజర్వుడు), సూళ్ళూరుపేట (ఎస్సీ), వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు (ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక తిరుపతి లోక్‌సభ సీటు చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. 1952లో ఈ ఎంపీ సీటుకు తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి రెండు సార్లు అంటే 1952, 1957 ఎన్నికల్లో తిరుపతి నుంచి మాఢభూషి అనంతశయనం అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునే సీ.దాస్ ఎంపీగా తిరుపతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రెండు సార్లు 1971, 1977లలో కాంగ్రెస్ పార్టీ తరపున టీ. బాలకృష్ణయ్య, 1980లో పసల పెంచలయ్య (కాంగ్రెస్) తిరుపతి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1984లో తిరుపతి ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీకి దక్కింది. చింతామోహన్ టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు.
ఇదే చింతా మోహన్ 1989, 1991లలో కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996 మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీగా గెలిచారు. 1998లో తిరిగి టీడీపీలో చేరిన చింతామోహన్ తిరుపతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరుపతి సీటు బీజేపీకి దక్కింది. టీడీపీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ తరపున తిరుపతి ఎంపీగా నందిపాకు వెంకటస్వామి గెలుపొందారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ తిరుపతి ఎంపీగా గెలుపొందారు. 2014లో వెలగపల్లి వరప్రసాద రావు, 2019లో బల్లి దుర్గాప్రసాద్ రావు వైసీపీ తరపున గెలుపొందారు. మొత్తమ్మీద తిరుపతి నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఘనత చింతా మోహన్‌కు దక్కింది. ఆయన మొత్తమ్మీద ఆరు సార్లు (రెండు సార్లు టీడీపీ తరపున, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున) తిరుపతి ఎంపీగా విజయం సాధించారు.
ఇక.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు 47.84 శాతంతో 5 లక్షల 80 వేల 376 ఓట్లు సాధించారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కారుమంచి జయరామ్ బీజేపీ తరపున పోటీ చేసి 44.76 శాతంతో మొత్తం 5 లక్షల 42 వేల 951 ఓట్లు సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ పోటీ చేసి కేవలం 33,333 ఓట్లు సాధించగలిగారు. కొత్తపల్లి సుబ్రహ్మణ్యం (సీపీఎం) 0.92 శాతంతో 11,168 ఓట్లు సాధించారు. నోటాకు 2.94 శాతంతో 35 వేల 420 ఓట్లు పడ్డాయి. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున బల్లి దుర్గా ప్రసాద్ రావు పోటీ చేసి విజయం సాధించారు. దుర్గా ప్రసాద్ రావు 55.03 శాతంతో ఏడు లక్షల 22,877 ఓట్లు సాధించారు. ఆయన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పనబాక లక్ష్మపై 2,28,376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పనబాక లక్ష్మకి 37.65 శాతంతో 4,94,501 ఓట్లు పడ్డాయి. నోటాకు 1.96 శాతంతో 25,781 ఓట్లు రాగా.. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చింతా మోహన్‌కు 1.84 శాతంతో 24,039 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి శ్రీహరి రావుకు 1.60 శాతంతో 20,971 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరి రావుకు 1.22 శాతంతో 16,125 ఓట్లు పడ్డాయి.
* సిట్టింగ్ స్థానం.. అదే గురుమూర్తికి పాజిటివ్
సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తికి కాస్త అనుకూలత ఉంది. దీనికి తోడు తిరుపతి ఎంపీ నియోజకవర్గం కింద ఉన్న ఏడు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ గెలుచుకొని ఉండడం, అందులో ఐదుగురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వైసీపీ ఎంపీ అభ్యర్థికి అనుకూలించే అంశాలు. అయితే.. రాజకీయాలకు కొత్త అతను కావడం, జగన్ వద్ద పనిచేసిన ఫిజియోథెరపిస్ట్ అని తప్పించి మరే ఇతర క్వాలిఫికేషన్ లేకపోవడం తనకు ఒక మైనస్ గా ఉంది.
* రత్నప్రభకు కలిసిరానున్న సామాజిక అంశం
జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న రత్నప్రభ నిన్న మొన్నటి వరకు డిపాజిట్లు తెచ్చుకోలేదు అన్నట్టుగా కనిపించినప్పటికీ, అనూహ్యంగా బీజేపీ, తిరుపతి ఎన్నికను దుబ్బాక వలే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతు ఇవ్వడం, సామాజిక సమీకరణాలు వీరికి అనుకూలంగా ఉండటం, ఆవిడకు పాజిటివ్‌గా మారాయి. పైగా వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఇద్దరు మాల సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, బీజేపీ వ్యూహాత్మకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. ఇది సోషల్ ఇంజనీరింగ్ పరంగా చూస్తే, బీజేపీ అభ్యర్థికి అనుకూలించే అంశమే. అయితే.. మాజీ ఐఏఎస్ అయినప్పటికీ రాజకీయాలకు కొత్త కావడం ఆవిడకు కొంత మైనస్‌గా ఉంది.
* అపార అనుభవం ఉన్న నేత పనబాక
వీరితో పోలిస్తే రాజకీయాల్లో పనబాక లక్ష్మికి అపార అనుభవం ఉంది. ఆవిడ కేంద్ర మాజీ మంత్రి కూడా. అయితే.. గతంలో పదవులను అనుభవించిన కారణంగా, కేంద్ర మంత్రిగా పదవిలో ఉన్న ఆ సమయంలో ఆవిడ పెద్దగా చేసిందేమీ లేదు అనే ప్రచారం స్థానికంగా బలంగా ఉంది. పైగా ఇది కేవలం ఉప ఎన్నిక కావడం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి టీడీపీకి సఖ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల ఆవిడ వైపు నుండి కూడా ఎంపీ స్థానం గెలిచి తీరాలన్న పట్టుదల కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వ్యక్తిగతంగా ఆవిడవైపు నుండి ఈ మైనస్ పాయింట్లు వుండగా, టీడీపీ తరపు నుంచి కూడా కొన్ని పాయింట్స్ పనబాక లక్ష్మికి మైనస్ గా మారాయి. ఇక.. ఇటీవల పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు కూడా క్యాడర్‌కు తప్పుడు సంకేతాలను ఇచ్చింది. ఇంతే కాకుండా పనబాక లక్ష్మి కోసం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొనలేదు. మొత్తం భారాన్ని అచ్చెన్నాయుడు వంటి నేతలపై చంద్రబాబు నాయుడు వేశారన్న అభిప్రాయం టీడీపీ క్యాడర్‌లో వినిపిస్తోంది. సొంత జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రచారానికి చంద్రబాబు నాయుడు పాల్గొనకపోతే అది దుష్ఫలితాలను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు టీడీపీ అధిష్టానానికి వినిపిస్తున్నాయా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.
* పోటాపోటీగా ఇన్‌చార్జి బాధ్యతలు
ఒకవైపు వైసీపీ తరఫు నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు విడివిడిగా బాధ్యతలు ఇచ్చి గెలుపు కోసం పని చేస్తూ ఉన్నారు. పైగా రాష్ట్ర మంత్రులు కొందరికి తిరుపతి ఉప ఎన్నిక గెలిపించే బాధ్యత కూడా ఇచ్చి ఉన్నారు. మరొక వైపు బీజేపీ తరఫున సునీల్ దియోధర్ ఆరు నెలలుగా తిరుపతిలోనే మకాం వేసి, పోలింగ్ బూత్ లెవెల్ డేటా తెప్పించుకుని సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. జనసేనకు అనుకూలంగా ఉండే సామాజిక వర్గాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇలా వైఎసీపీ, బీజేపీ రకరకాల వ్యూహాలతో ముందుకు పోతూ ఉండగా, టీడీపీ పూర్తిగా క్యాడర్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తోంది. క్యాడర్ పై నమ్మకం ఉంచడం సమంజసమైనదే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వ్యూహం కొరవడితే, టీడీపీ అభ్యర్థి గెలవడం అటుంచి మూడో స్థానానికి పడిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. ఫైనల్‌గా ప్రస్తుత పరిస్థితిని చూస్తే వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ బలంగా కనిపిస్తోంది. అయితే మరో రెండు వారాలపాటు సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో సరైన వ్యూహంతో ముందుకు వస్తారా, లేక అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా అన్నది వేచి చూడాలి.
-శ్రీనివాస్.బి
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Who won the tirupati by election 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com