నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా జానారెడ్డి పేరును ప్రకటించగా.. టీఆర్ఎస్, బీజేపీ కూడా సోమవారం తమ క్యాండిడేట్లను ప్రకటించాయి. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, బీజేపీ నుంచి డాక్టర్ రవినాయక్ బరిలో దిగనున్నారు. ఈ ఉప ఎన్నికలో పొలిటికల్ పార్టీలు కులాల లెక్కలు పక్కాగా చూసుకొని టికెట్లు ఇచ్చాయి. నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న రెడ్డి, యాదవ, లంబాడా కమ్యూనిటీలకు ప్రయారిటీ ఇచ్చాయి. రెడ్డి కులానికి కాంగ్రెస్ నుంచి, యాదవ కులానికి టీఆర్ఎస్ నుంచి, లంబాడా కులానికి బీజేపీ నుంచి టికెట్లు దక్కాయి. బై పోల్ సందడి మొదలైనప్పటి నుంచి కుల సమీకరణలపైనే నియోజకవర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అభ్యర్థులు కూడా ఖరారు కావడంతో కులం లెక్కలు ఎంత వరకు లాభం చేకూరుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో మంచి ఊపు మీద కనిపించింది బీజేపీ. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయి కాస్త డీలాపడిపోయినట్లుగా ప్రస్తుతం అనిపిస్తోంది. అయితే.. ఆ ప్రభావం ఎట్టిపరిస్థితుల్లోనూ నాగార్జున సాగర్ స్థానంపై పడకుండా జాగ్రత్త పడాలని బీజేపీ ఆరాట పడుతోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ స్ఫూర్తితో ఈ ఎన్నికలో ఢీకొట్టాలని భావిస్తోంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ జీవన్మరణ సమస్యతో ఈ ఎన్నికల రంగంలో పోరాడుతోంది. అటు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నిస్తోంది. మొత్తంగా ఇప్పుడు సాగర్ వేదికగా ఈ మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఢీకొనబోతున్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన సేనలు రాష్ట్రం నలుమూలల నుంచి 20 రోజులుగా సాగర్‌లో మకాం వేశారు. మరోవైపు.. కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు నామినేషన్ల దాఖలుకు గడువుకు ఒకరోజు ముందు టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. రాజకీయ బాహుబలి, 70 ఏళ్ల వయసున్న జానాను ఎదుర్కొనేందుకు 36 ఏళ్ల వయసున్న భగత్, రవినాయక్ సిద్ధమయ్యారు. వీరు ముగ్గురు మూడు సామాజికవర్గాలకు చెందిన నేతలు కావడం విశేషం.
నేడే ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్
మరోవైపు.. వరుస సెలవులు రావడం, 30న చివరి గడువు కావడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేష్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి భగత్ ఉదయం 11గంటలకు నామినేషన్ వేయనుండగా, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3గంటల మధ్య బీజేపీ అభ్యర్థి రవినాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 12 గంటలకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సమర్పించనున్నారు. ఇప్పటి వరకు సాగర్ ఉప ఎన్నికకు మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3న ఉపసంహరణ కాగా.. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది.
ఇక క్షేత్రస్థాయిలోకి..
ఇదిలా ఉండగా.. నేటితో నామినేషన్ల ఘట్టం ముగియనుండడంతో ఇక పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టబోతున్నాయి. మూడు ప్రధాన పార్టీలతోపాటు టీడీపీ, ఎమ్మార్పీఎస్ వంటి పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించనున్నారు. తాను చేసిన అభివృద్ధితోపాటు, అవినీతికి దూరంగా ఉండటం, ఊరూరా పరిచయాలు కలిసొచ్చే అంశంగా జానా భావిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అధికార పార్టీ అండదండలు, ప్రచారంలో భారీ సైన్యం, యాదవ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయని, పార్టీకి మంచి ఆదరణ ఉందని సర్వేల్లో స్పష్టం కావడం కలిసొచ్చే అంశాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి భగత్ అంచనా వేస్తున్నారు. 40 వేల ఓట్లున్న లంబాడ సామాజికవర్గం, వైద్య వృత్తితో నియోజకవర్గ ప్రజలకు దగ్గర కావడం, కేంద్రంలో అధికారంలో ఉండటం, యువతలో పార్టీపై క్రేజ్, కమిట్‌మెంట్ కలిగిన సైన్యం ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తుండటం కలిసొచ్చే అంశాలుగా రవికుమార్ నాయక్ లెక్కలు వేసుకుంటున్నారు.
మంత్రులు, సినీ గ్లామర్
ఈ నెల 31 నుంచి ప్రచార పర్వంలో దూసుకుపోయేందుకు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్రస్థాయి నాయకులు, మంత్రులు, సినీ గ్లామర్ ఇలా ఓటర్లను ఆకట్టుకునే విధంగా సాగర్‌లో ఊరూర ప్రచారం చేయనున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే పార్టీలు మారడం ప్రారంభం కాగా, వచ్చే రోజుల్లో అవి మరింత ఊపందుకోనున్నాయి. ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్‌కు ముందు చివరి రెండు రోజులు మద్యం ఏరులై పారుతుందని, డబ్బు కట్టలు తెంచుకుంటుందని అంతా అంచనా వేస్తున్నారు.
ప్రచారపర్వానికి కరోనా అడ్డంకి
ఉప ఎన్నికలో హోరాహోరీగా ప్రచారం సాగించాలని ప్రధాన పార్టీలు నిర్ణయించగా, తాజాగా వచ్చిన కరోనా నిబంధనలు అడ్డంకిగా మారాయి. నామినేషన్‌కు అభ్యర్థితోపాటు ఒక్కరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించనున్నారు. ప్రచారంలో సైతం అభ్యర్థితోపాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. భారీ వాహన ర్యాలీలకు అనుమతి లేదు. కేవలం ఐదు వాహనాలు మాత్రమే ర్యాలీలో ఉండాలి. ఆ వాహన శ్రేణి వెళ్లాకే మరో ఐదు కార్లకు అనుమతి ఉంది. బహిరంగ సభలకు భారీ మైదానాలనే వినియోగించాలి. సభాస్థలిలో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. అందుకు సీటింగ్ మార్కింగ్ సైతం చేయాలి. మాస్క్‌లు, శానిటైజర్లు, థర్మో స్కానర్లను సభల్లో ఉపయోగించాలి. మొత్తానికి కొవిడ్ నిబంధనలు ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపనున్నాయి.
భగత్ మీ తమ్ముడి లాంటి వాడు..
‘భగత్ మీ తమ్ముడి లాంటి వాడు.. ఆయన్ను విజేయుడిగా తిరిగి నా ముందుకు తీసుకురావాలి’ అంటూ టీఆర్‌ఎస్ నేతలు, టికెట్ ఆశించిన కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో సీఎం కేసీఆర్ అన్నారు. అదే విధంగా అపార రాజకీయ అనుభవం ఉన్న వీరిద్దరినీ గౌరవించి కలుపుకుపోవాలని భగత్‌కు సూచించారు. నోముల నర్సింహయ్య సాగర్ ప్రజలకు చేసిన సేవలకు, తనతో ఉన్న సాన్నిహిత్యానికి బహుమతిగా బీ -ఫాం ఇస్తున్నానని, రేపటి నుంచి ఏప్రిల్ 18 వరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సాగర్‌లో ఉండి అన్నీ చూసుకుంటారని భరోసా ఇచ్చారు. వచ్చే రోజుల్లో కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా, చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారానికి తాను గానీ, కేటీఆర్‌గానీ వస్తారని చెప్పారు.
టీఆర్ఎస్ సర్వేలు చేయించి..!
సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో నాగార్జునసాగర్‌లో ఏప్రిల్17న ఉప ఎన్నిక జరుగనుంది. అయితే.. నర్సింహయ్య యాదవ కులానికి చెందిన వ్యక్తి కావడంతో అదే కులానికి ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వాలనే డిమాండ్ టీఆర్ఎస్‌లో ఫస్ట్ నుంచి వినిపించింది. అదికూడా నోముల కుటుంబ సభ్యులకే ఇవ్వాలని పలువురు పట్టుబట్టారు. మరోవైపు నోముల నాన్‌లోకల్ కాబట్టి లోకల్స్‌కే చాన్స్ ఇవ్వాలని రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడు ఎంసీ కోటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. పైగా దుబ్బాక ఉప ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో పార్టీ హైకమాండ్‌కు సాగర్ ఉప ఎన్నిక సవాల్‌గా మారింది. టికెట్ఇవ్వడం వెనుక సిట్టింగ్ అంశం కన్నా కులం లెక్కలను పరిగణనలోకి తీసుకుంది. దాదాపు రెండు, మూడు నెలల నుంచి వివిధ రకాల సర్వేలు చేయించింది. నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది..? ఏ కులానికి చెందిన లీడర్లకు ఓటర్ల మద్దతు ఏ మేరకు ఉంది..? అనే కోణంలో సర్వేలు జరిపించింది. చివరిసారిగా వచ్చిన సర్వే రిపోర్ట్‌లో యాదవ కులానికే ఎక్కువ పర్సంటేజీ మద్దతు లభించినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిఎవరనే విషయం వచ్చేసరికి నోముల భగత్, వటికూటి గురవయ్య పేర్లు తెరపైకి వచ్చాయి. యాదవ కులానికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయినప్పటికీ అభ్యర్థి విషయంలోనే చివరవరకు సస్పెన్స్ కొనసాగించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో అభ్యర్థి ఎవరైనా సరే ఉప ఎన్నికలో తమకు తిరుగుండదనే నమ్మకంతో భగత్ పేరును టీఆర్ఎస్ఫైనల్చేసింది.
ప్రత్యర్థుల వ్యూహాలకు దీటుగా బీజేపీ
దుబ్బాకలో మాదిరిగానే సాగర్‌లోనూ సత్తా చాటుకునేందుకు బీజేపీ రెడీ అయింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ కులానికి ప్రయారిటీ ఇస్తాయో అంచనా వేశాక తమ అభ్యర్థిని డిసైడ్ చేయాలని చివరి వరకు సస్పెన్స్ కొనసాగించింది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపినప్పటికీ మెజార్టీ ఓటు బ్యాంకు సాధించేందుకు బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నించింది. చివరకు లంబాడా కులానికి చెందిన రవి నాయక్ పేరును ఫైనల్ చేసింది. ఈ నియోజకవర్గంలో లంబాడా ఓటర్లు 34,027 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులానికి, టీఆర్ఎస్ యాదవ కులానికి ప్రాధాన్యం ఇచ్చినందున తాము లంబాడా కులానికి ప్రయారిటీ ఇస్తే మంచి ఫలితం దక్కుతుందని బీజేపీ అంచనా వేసింది. ఇప్పటికే గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యపై ఆ పార్టీ నేతలు పోరాటం చేస్తున్నారు. లంబాడా కమ్యూనిటీకి టికెట్ ఇవ్వడంతో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు తమకు పడుతుందని బీజేపీ నమ్ముతోంది.
సీనియార్టీని నమ్ముకున్న జానా
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి నియోజకవర్గంలో ఇంటింటికీ తెలుసు. ఆయన తన సీనియార్టీనే నమ్ముకొని ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటింటికీ తిరుగుతున్నారు. సీనియర్‌ను అయిన తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీ నుంచి మిగితా సీనియర్లను ఎవరినీ నమ్ముకోకుండా సొంతంగా తన పని తారు చేసుకు పోతున్నారు. కులాలకతీతంగా అందరినీ కలుస్తున్నారు. గతంలో తాను చేసిన సేవలను వివరిస్తున్నారు. భవిష్యత్తులో చేసే పనులను చెబుతున్నారు.
మొత్తంగా ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు చాలెంజ్‌గా తీసుకోవడంతో ఫైనల్‌గా గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఆసక్తికరంగా మారింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Who won the nagarjuna sagar by election
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com