
ఏపీలో ఎట్టకేలకు బీజేపీ–జనసేనల పొత్తు బలపడుతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తమ కూటమి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అని ప్రకటించడంతో జనసేన నేతల్లో సంబరం అంబరాన్ని తాకింది. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లేట్‌గా అయినా బీజేపీ–జనసేన కూటమి సరైన నిర్ణయంతీసుకుందనే అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.
ఇక అంశం ప్రత్యర్థి పార్టీలకు మింగుడు పడడం లేదు. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. ఎలాగూ.. ఒక పార్టీ తన స్టాండ్‌ను ప్రకటించాక.. ప్రత్యర్థి పార్టీలు ఎలాగూ మోకాలడ్డుతుంటాయి. అలా చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీర్రాజు విషయంలోనూ అదే జరిగింది. ఎప్పుడైనా ప్రత్యర్థి పార్టీల నుంచి స్పందన రాకుంటే ఆశ్చర్యపోవాలి కానీ.. రెస్పాన్స్ వచ్చాక వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదేమో. సోము వీర్రాజు ప్రకటనతో ఆ ప్రభావం తిరుపతి ఉప ఎన్నికలో చూపుతుందని ఇరు పార్టీలూ నమ్ముతున్నాయి.
వీర్రాజు ప్రకటనతో బీజేపీ –జనసేన మధ్య రాజకీయ బంధం మరింత బలపడనుంది. పైగా తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేయడానికి పవన్‌కల్యాణ్ రావడం ఆ పార్టీకి కలిసి రానుంది. ఇంతకాలం అంటీముట్టనట్టుగా ఉన్న జనసేన.. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తన వైఖరిని మార్చుకుంది. రత్నప్రభ తమ అభ్యర్థే అన్నట్టుగా జనసేన శ్రేణులు భావించే అవకాశాలు లేకపోలేదు. తమ అధినేత పవన్ నేరుగా వచ్చి తిరుపతిలో ప్రచారం చేసినా.. ఓట్లు పడకుండా తమ ఫ్యూచర్‌కు ప్రమాదమని ఆలోచనలో ఉన్నారు. అదే టీడీపీతో కలిసి ప్రయాణిస్తే.. అంతిమంగా చంద్రబాబు లేదంటే లోకేశ్ మాత్రమే సీఎం అవుతారని జనసేన శ్రేణుల మధ్య చర్చ జరుగుతోంది.
మరోవైపు.. జనసేనను బీజేపీకి దూరం చేసి తమ వైపు తిప్పుకోవాలని చాలా కాలంగా టీడీపీ చేయని ప్రయత్నాలంటూ లేవు. దీనికితోడు ఎల్లో మీడియా సైతం జనసేన భజన చేసింది. అటు ఎల్లో మీడియా.. ఇటు ఎల్లో బ్యాచ్ కొంతకాలంగా శ్రమిస్తున్నాయి. తాజాగా సోము వీర్రాజు చేసిన ప్రకటన వారి ఆశలకు గండికొట్టినట్లైంది. ఇప్పుడు బీజేపీతో కలిసి కొనసాగడం తమకే ఎక్కువ అవసరమనే ఆలోచనను జనసేనలో సోము వీర్రాజు క్రియేట్ చేయగలిగారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్