2024 Election In AP: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళుతుండగా.. మరో రెండు రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వాతావరణం వాడి వేడిగా రాష్ట్రంలో కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన వైసిపి.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరో పక్క ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో కనిపిస్తోంది. ఇకపోతే ప్రధాన పార్టీగా రాష్ట్రంలో ఎదుగుతున్న జనసేన అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక బిజెపి కూడా రాష్ట్రంలో ఎంతో కొంత ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారాన్ని రాష్ట్రంలో చేజిక్కించుకోబోతుందో, ఆ పార్టీకి అండగా ఉండి తద్వారా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాన్ని బిజెపి చేస్తోంది.
బలమైన ఓటు బ్యాంకుతో.. బలంగా వైసీపీ..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే గడిచిన నాలుగేళ్లలో వివిధ సంక్షేమ కార్యక్రమాలతో బలమైన ఓటు బ్యాంకును ఆ పార్టీ సృష్టించుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా భారీ స్థాయిలోనే సీట్లు తెచ్చుకుంటుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నందున.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మరింత ఓటు బ్యాంకును సంపాదించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బలంగానే కనిపిస్తుండడం ప్రతిపక్షాలకు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిని ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే జమ చేస్తుండడం, స్థానిక నాయకులకు, అధికారులకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయడం వంటి కార్యక్రమాలు అధికార వైసీపీకి బలంగా మారనున్నాయి. వీటితోపాటు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు ఆ పార్టీకి ప్రధాన అసెట్ గా మారనున్నాయి. అయితే, నాలుగేళ్లుగా లోకల్ నాయకులను వైసీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. వీరంతా తీవ్రమైన అసహనంతో ఉన్నారు. వీరు ఎన్నికల్లో ఎంత వరకు కష్టపడతారు అన్నది కూడా వైసీపీ విజయాన్ని నిర్ణయిస్తుంది అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆత్మరక్షణలో పడిపోయిన తెలుగుదేశం పార్టీ..
తెలుగుదేశం పార్టీ రాజమండ్రి వేదికగా నిర్వహించిన మహానాడు ముందు వరకు అనేక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వాతావరణం కనిపించింది. అయితే, మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో అనేక అంశాలు విభిన్న వర్గాలను ఆలోచనలో పడేశాయి. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందంటూ ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ.. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువే చేస్తామంటూ విచ్చలవిడి హామీలను ఇచ్చింది. ఈ హామీల పట్ల వైసీపీని వ్యతిరేకిస్తున్న వర్గాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల కూడా వ్యతిరేకత పెరిగింది. వైసిపి ఆలోచనలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందనుకున్న తరుణంలో.. అంతకుమించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారయ్యేలా ఉచితాలు అందిస్తామంటూ హామీ ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని నుంచి తెలుగుదేశం పార్టీ బయటపడి వైసిపిపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తామని ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాకపోవచ్చు అన్న భావన అనేక వర్గాల్లో ఉంది. ఏదో కష్టపడి ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల రూపంలో ఎంతో కొంత లబ్ది పొందుతున్న తమకు.. కొత్త పార్టీని మీదకు ఎక్కించుకోవడం ద్వారా నష్టమే తప్ప లాభం లేదన్న భావన మిగిలిన వర్గాల్లోనూ కనిపిస్తోంది.
కూటమిగా ముందుకెళ్తే ప్రయోజనం కనిపించే అవకాశం..
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. 2014 ఎన్నికల మాదిరిగా బిజెపిని కూడా కలుపుకుని వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లి తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు కొంతవరకు విజయవంతమైనట్లు కనిపిస్తోంది. రెండు రోజుల కిందట ఏపీలో పర్యటించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీల కూటమి దశగా ముందుకు వెళుతున్నాయి అన్న సంకేతాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనికి తోడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై గతంలో ఉన్న అవినీతి కేసులు, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కేసు వంటి వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే కొద్ది నెలలు రాష్ట్రంలోని అధికారంలో ఉన్న వైసీపీకి అత్యంత కీలకంగా మారాయి. ఒకవేళ బిజెపి టిడిపి టిడిపి జనసేన కలిసి ఎన్నికలకు వెళితే మాత్రం వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి బలంగా ఉన్న వైసిపి ఓడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా వైసీపీ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది.