Homeజాతీయ వార్తలుKCR Survey Report: ఉండేదెవరు?.. పోయేదెవరు?.. కేసీఆర్‌ చేతిలో సర్వే నివేదిక.. ఎమ్మెల్యేల్లో టెన్షన్‌!!

KCR Survey Report: ఉండేదెవరు?.. పోయేదెవరు?.. కేసీఆర్‌ చేతిలో సర్వే నివేదిక.. ఎమ్మెల్యేల్లో టెన్షన్‌!!

KCR Survey Report: పది నెలల ముందె తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో అంతర్మథనంలో పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఏకు మేకై కూర్చున్న బీజేపీని, అక్కడక్కడా బలంగా ఉన్న కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో ఎలా దెబ్బకొట్టాలని వ్యూహ రచన చేస్తున్నారు. మునుగోడులో వేల కోట్లు ఖర్చు చేసినా.. కేవలం పదివేల ఓట్ల మెజారీనే వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరు, బలం, సానుకూల, వ్యతిరేక అంశాలపై కేసీఆర్‌ సర్వే చేయిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నారు. అప్పుడే తాను జాతీయస్థాయిలో చక్రం తిప్పవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ బాస్‌.. ఎన్నికలకు ఇప్పటి నుంచే యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు.

KCR Survey Report
KCR Survey Report

 

టెన్షన్‌ పెడుతున్న మునుగోడు ఫలితం…
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచినా.. అక్కడ ఎదురైన పరిస్థితులు కేసీఆర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నారు. వేల కోట్లు అభివృద్ధి పనులు చేసి.. మరో వేల కోట్ల పనులకు హామీ ఇవ్వడంతోపాటు 80 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులను మోహరిస్తేగానీ ఆమాత్రం మెజారిటీ వచ్చిందన్న భావనలో కేసీఆర్‌ ఉన్నారు. అంటే టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం గులాబీ బాస్‌కు అర్థమైంది.

వ్యతిరేకత ఎవరిపై
మునుగోడు ఫలితం తర్వాత ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకత ప్రభుత్వంపైనా.. ఎమ్మెల్యేల పైనా.. అని సమాలోచనలు చేస్తున్నారు. ఎవరిపై ఎక్కువ ఉందని కేసీఆర్‌ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై అంతర్గత సర్వే చేయిస్తున్నారు. గతంలో ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్‌ కిశోర్‌ ఇచ్చిన నివేదికతో తాజా సర్వే వివరాలను సరిపోల్చుకుంటున్నారు.

40 మందికి వ్యతిరేకంగా పీకే రిపోర్టు..
తెలంగాణలో 40 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ గతంలోనే కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు. అయితే దీనిని కేసీఆర్‌ పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అధినేత తన నివేదికను పట్టించుకోవడం లేదని పీకే టీం తెలంగాణ నుంచి తప్పుకుంది.

సిట్టింగులకు టికెట్‌పై సొంత పార్టీలో వ్యతిరేకత..
తాజాగా సీఎం కేసీఆర్‌ సిట్టింగులందరీకి టికెట్‌ ఇస్తానని ప్రకటించారు. కానీ, దీనిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిట్టింగులకు టికెట్‌ ఇస్తే క్యాడర్‌ కూడా సగం మందికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. ఈ విషయం టీఆర్‌ఎస్‌ అంతర్గత సర్వేలో వెల్లడైంది. దీంతో కేసీఆర్‌ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అటు ప్రజల్లో.. ఇటు సొంత క్యాడర్‌లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సిట్టింగులకు టికెట్‌ ఇస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్లు తెలిసింది.

KCR Survey Report
KCR Survey Report

చక్కదిద్దే పనిలో కేసీఆర్‌..
2023 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్‌.. పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. 119 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారు. వాటిలో కచ్చితంగా విజయం సాధించేవి 40 ఉండగా, కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు 30 నుంచి 35 వరకు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీక్‌గా ఉన్నట్లు నివేదికలు అందాయి. దీంతో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో విజయం కోసం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టేలా మంత్రులు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు టీఆర్‌ఎస్‌ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version