Rahul Gandhi: కర్ణాటకలో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీకి సరికొత్త జవసత్వాన్ని ఇచ్చింది.. కొడిగట్టుకుపోతోంది అనే విమర్శ నుంచి ఖచ్చితంగా నిలబడగలదు అనే స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. కర్ణాటక ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. సోనియాగాంధీ వయసు రిత్యా ఇంట్లో ఉంటున్న నేపథ్యంలో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇటీవల హైదరాబాదులో పర్యటించారు.. భారీ బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ శ్రేణల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ గాంధీ కూడా జోడోయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిని తలకు ఎత్తుకున్నారు. దీని ఫలితం కర్ణాటక ఎన్నికల ద్వారా బయటకు వచ్చింది.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు
ఇక కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలని రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత మరింతగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.. ఇందులో భాగంగానే ఇటీవల హర్యానాలో ఒక ట్రక్కులో ప్రయాణించారు. ట్రక్కు డ్రైవర్లతో సంభాషించారు. సమస్యలు ఏమిటో తెలుసుకున్నారు. ఇక తాజాగా అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. అక్కడ కూడా ఆయన ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. తెలంగాణకు చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కారులో మొత్తం చుట్టేశారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు సిక్కు డ్రైవర్తో ట్రక్కులో ప్రయాణించారు. ఈ క్రమంలో వారితో మాట్లాడిన రాహుల్ గాంధీ అనేక విషయాల మీద ఆరా తీశారు.
తెలంగాణ యువకుడికి అరుదైన అవకాశం
అమెరికాలో స్థిరపడిన శ్రీధర్ పుష్పలి అనే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు రాహుల్ గాంధీని వాషింగ్టన్ డీసీ వీధుల్లో తన కారులో తిప్పే అరుదైన అవకాశం లభించింది. పాలమూరులో పుట్టిన శ్రీధర్ అక్కడే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిగౌడ్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుల సమన్వయంతో రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 1న రాహుల్ గాంధీ అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసీని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ పుష్పలి తన “టెస్లా వై ” కారులో రాహుల్ గాంధీని ఎక్కించుకొని వాషింగ్టన్ డిసి వీధుల్లో మొత్తం తిప్పారు. కాపిటల్ హిల్ బిల్డింగ్, విల్లర్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్, పెన్సిల్వేనియా ఎవెన్యూ ప్రాంతాల మీదుగా రాహుల్ గాంధీ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా, రాహుల్ సన్నిహిత సహచరుడు అలంకార్ సవాయ్ కూడా ప్రయాణంలో పాల్గొన్నారు.
విందు కూడా
పర్యటన ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ గౌరవార్థం క్యాపిటల్ హిల్ వద్ద ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విందుకు శ్రీధర్, ఆయన భార్య, పిల్లలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాహుల్ గాంధీ వారి కుటుంబంతో సరదాగా గడిపారు..” రాహుల్ గాంధీని నా కారులో తిప్పాలని ఆహ్వానం అందగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఈ కారు ఎలా ఉంటుంది? ఇందులో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వంటి వాటి వివరాలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి చూపించారు. మొత్తానికి మా 15 నిమిషాల ప్రయాణం చాలా సరదాగా గడిచిపోయింది” అని శ్రీధర్ వ్యాఖ్యానించారు..
ట్రక్కులో ప్రయాణం
శ్రీధర్ తో ప్రయాణం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ వాషింగ్టన్ డిసి నుంచి న్యూయార్క్ వెళ్లారు. ఈ క్రమంలో భారత సంతతి డ్రైవర్ల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ట్రక్కులో 90 కిలోమీటర్ల ప్రయాణించిన రాహుల్ గాంధీ.. డ్రైవర్ల కష్టాలు, ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రయాణంలో ట్రక్కు డ్రైవర్ తాజ్ందర్ సింగ్ రాహుల్ కు సిద్దు మూసే వాలా పాటను వినిపించారు. తర్వాత ట్రక్కు ఓ రెస్టారెంట్ వద్ద ఆగగా.. వారితో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. అనంతరం వారికి టాటా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.