Sri lanka Crisis- Sajith Premadasa: లంకలో రావణ కాష్టం రగులుతోంది. గొటబాయ సోదరులు చేసిన దాష్టీకానికి పతనావస్థకు చేరుకుంది. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. తినేందుకు తిండి లేదు. కొనుక్కునేందుకు నిత్యావసరాలు లేవు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. శ్రీలంక కరెన్సీ డాలర్ తో పోలిస్తే 365 రూపాయలకు చేరుకుంది. ప్రపంచంలోనే ఈమధ్య అత్యంత వేగంగా పడిపోయిన కరెన్సీ ఇదే కావచ్చు. ఇలాంటి కల్లోల లంకలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితి నడుస్తోంది. వివిధ దేశాలకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. తనకు అప్పు చెల్లించకపోవడంతో చైనా హంబన్ టోటా నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. ఇలాంటి పరిస్థితులలో లంకను నడిపించే నాయకుడు ఎవరు? పర్యాటకానికి, బౌద్ధ ఆరామాలకు ప్రతీక అయిన లంకలో శాంతిని ఎవరు స్థాపిస్తారు? సౌభ్రాతృత్వాన్నిఎవరు కాపాడుతారు?
సజిత్ ప్రేమదాస పై ఆశలు
రణ సింఘె.. శ్రీలంకలో ఒకప్పుడు అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి.. ఈయనను 1993లో ఎల్టీటీఈ దారుణంగా హత్య చేసింది. జాత్యాంహంకార ధోరణికి నిరసనగానే తాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అప్పట్లో ప్రభాకరన్ తెలిపారు. రణ సింఘె చనిపోయిన ఏడేళ్ల తర్వాత ఆయన పెద్ద కుమారుడు సజిత్ ప్రేమదాస రాజకీయాల్లోకి వచ్చారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో హంబన్ టోటా నుంచి ఎంపీగా గెలిచారు. ప్రతిపక్ష పార్టీకి నేతగా కొనసాగుతున్నారు. శ్రీలంక పార్లమెంట్లో 225 సీట్లు ఉన్నాయి. కనీస మెజారిటీ 113. రాజపక్స సోదరుల యునైటెడ్ నేషనల్ పార్టీ ( యూఎన్పీ) కిందట ఎన్నికల్లో మరికొన్ని పార్టీలతో కలిసి యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్(యూపీఎఫ్ఏ) గా ఏర్పడింది.145 స్థానాల్లో గెలిచింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో స్థానంలో నెగ్గింది. ఈ కూటమి నుంచి 43 మంది ఎంపీలు స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు.
ఇక సజిత్ ప్రేమ దాస పార్టీ సమగీజన బలవేగయ కి 53, తమిళ్ నేషనల్ అలయన్స్ కి 10, సమతా విముక్తి పెరమున పార్టీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరికి యూపీఎఫ్ఏ 43 మంది ఎంపీలను కలుపుకుంటే సజిత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. కాగా యూపీఎఫ్ఏ నుంచి సమాచార శాఖ మంత్రి గా ఉన్న దుల్లాస్ దుహంకుమార అలహప్పేరుమ, ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ప్రధాని విక్రమసింఘె పోటీ పడుతున్నారు. రహస్య బ్యాలెట్ పద్ధతిన ఈ నెల 20న తదుపరి అధ్యక్షుడి జరగనుంది.
మచ్చలేని వ్యక్తిత్వం
సజిత్ ప్రేమదాసకు మచ్చలేని నాయకుడని పేరు ఉంది. తన తండ్రి మరణం తర్వాత శ్రీలంకలో అధ్యక్షుడి తరహా పాలన అసలు ఉండకూడదని గళమెత్తిన నాయకులలో ప్రేమదాస ఒకరు. దేశ పార్లమెంట్ లో సమ్మిళిత రాజకీయం, అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని ఆయన కోరిక. మైనార్టీలను శత్రువులుగా చూడటం అనేది లంక భద్రతకు పెను ముప్పని ఆయన పలుమార్లు హెచ్చరించారు కూడా. అయితే మైనార్టీ సంస్థగా ఉద్భవించిన ఎల్టీటీఈ చేతిలోనే ఆయన తండ్రి హత్యకు గురవడం యాదృచ్ఛికం.
మైనార్టీ హక్కుల కోసం గల మెత్తుతారు కాబట్టే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు టీఎన్ఏ మద్దతు ఇస్తుందని శ్రీలంక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో మాస్టర్ చేసిన ప్రేమదాస కు ఆర్థిక శాస్త్రంపై బాగా పట్టుంది. అప్పట్లో గొటబయ సర్కారు చమరుపై రాయితీలు ఇవ్వడం, సేంద్రీయ వ్యవసాయం పేరుతో ఎరువుల దిగుమతులను తగ్గించడంపై తీవ్రంగా గళమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ గొటబయ సర్కారు ప్రేమ దాసను అణచివేసింది. లేనిపోని కేసులు పెట్టి జైలు పాలు చేసింది. దేశం మొత్తం నాశనమవుతోందని ప్రేమదాస నాడు చెప్పారు. నేడు అది నిజమైంది. విద్యావంతుడు పైగా, అణగారిన వర్గాల కోసం ఉద్యమించిన నాయకుడు కావడంతో తమ దేశాన్ని కాపాడగల సత్తా ప్రేమ దాసకు మాత్రమే ఉందని లంకేయులు విశ్వసిస్తున్నారు.
Also Read:Education System in AP: ఏపీలో విద్యావ్యవస్థ నిర్వీర్యం. ఆ జీవోలతో అస్తవ్యస్తం