Women Give Mud Bath To Bjp Mla: మన దగ్గర వర్షాలు పడుకుంటే ఏం చేస్తాం? రెండు కప్పలను తీసుకొని వాటికి పెళ్లి చేసి ఊరంతా ఊరేగిస్తాం. ఊరేగింపు బృందం కాళ్లను గ్రామస్తులు నీళ్లతో కడుగుతారు. కొబ్బరికాయలు కొడతారు. వర్షాలు మెండుగా కురిస్తే గ్రామదేవతలకు జంతు బలులు ఇస్తామని మొక్కుతారు. కానీ మనలాంటి ఆచారాలు అన్నిచోట్ల ఉండవు. కానీ విభిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ప్రాంతం అనావృష్టితో అల్లాడుతోంది. వర్షాలు కురవక చెరువులన్నీ నెర్రెలు బాశాయి. ప్రాజెక్టులు నిండుకున్నాయి. విత్తనాలు వేసే అవకాశం లేక వర్షం కోసం ఆకాశం వైపు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ తాగునీటి కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. పైగా మహారాజ్ గంజ్ పెద్ద పట్టణం కావడంతో తాగునీటి కోసం ప్రజల నుంచి స్థానిక ఎమ్మెల్యేకు, పాలిక చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులకు తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వరుణుడు కరుణ చూపాలని అక్కడి మహిళలు ఏం చేశారో తెలుసా?
దేశమంతా వర్షాలు మహారాజ్ గంజ్ లో మాత్రం
అస్సాం నుంచి మొదలుపెడితే జమ్మూ కాశ్మీర్ వరకు విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి దెబ్బకు గత రికార్డులు మొత్తం బద్దలై పోతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మిన్ను మన్ను ఏకమయ్యేలాగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. శ్రీరాముడి పాదాలను తాకాలని తహతహలాడుతోంది. కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఇప్పటికే ఊళ్ళకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. అప్పట్లో కోస్తాంధ్రలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఏర్పడిన పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో దర్శనమిస్తున్నాయి. దేశం మొత్తానికి భిన్నంగా ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ ప్రాంతం మాత్రం తీవ్రమైన కరువుతో అల్లాడుతోంది. క్రమంలోనే వర్షాలు బాగా కురవాలని మహారాజ్ గంజ్ లోని పిపర్ డ్యూరా గ్రామానికి చెందిన మహిళలు బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియా, నగరపాలక చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ కు బురద స్నానం చేయించారు. అందుకు తగ్గట్టుగా పాటలు పాడుతూ డ్యాన్సులు వేశారు. ముందుగా మహిళలు స్థానిక ఎమ్మెల్యేను, నగరపాలిక సంస్థ చైర్మన్ ను మట్టి తొట్టిలో నానబెట్టి వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేశారు. ఆ తర్వాత వారి మెడ పై దండలు వేసి, హారతులు ఇచ్చారు. కొబ్బరికాయలు కొట్టి బురద స్నానం చేయించారు.
ఎందుకు ఈ నమ్మకం
ఉత్తరప్రదేశ్ లో 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. పేరుకు పెద్దపెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పటికీ నేటికి 70 శాతం సాగు వర్షం మీదే ఆధారపడి ఉన్నది.. ఉత్తరప్రదేశ్ లో చెరుకు, వరి, మొక్కజొన్న, పత్తి, సోయా బార్లీ, గోధుమ, రాగులు ప్రధాన పంటలు. ప్రస్తుతం మహారాజ్ గంజ్ ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఏ పంట లూ సాగు చేయలేదు. మన ప్రాంతంలో కప్పను ఎలాగైతే వరుణుడికి ప్రీతిపాత్రం అనుకుంటామో.. ఉత్తర ప్రదేశ్ మహిళలు మట్టిని కూడా అలాగే విశ్వసిస్తారు.
వరుణుడు కరుణ వల్ల మేఘం వర్షిస్తే రాలే వాన చినుకుల తాకిడికి ముందుగా పరిమళించేది మట్టే కాబట్టి.. నీళ్లు పోసి బురదలాగా చేసి స్నానం చేయిస్తారు. స్నానం చేసి పాటలు పాడటం వల్ల వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని అక్కడ మహిళల నమ్మకం. బురదలో స్నానం చేయడాన్ని అక్కడ స్థానికంగా “కల్ కలూటీ” అని పిలుస్తారు. కాగా మండే ఎండల వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు బురద స్నానం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని ఎమ్మెల్యే కనోజియా వివరించారు. వాన దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు స్థానిక మహిళలు పాడిన పాటలు వినసొంపుగా ఉన్నాయని, ఈ సాంప్రదాయం మా తాత ముత్తాతల నుంచి వస్తోందని నగరపాలిక చైర్మన్ గోపాలకృష్ణ జైస్వాల్ తెలిపారు. మొత్తం మీద దేశమంతా వర్షాలు కురుస్తూ అల్లకల్లోలం ఏర్పడుతుంటే ఉత్తరప్రదేశ్ లో మాత్రం దుర్భిక్షం ఏర్పడటం నిజంగా ఆశ్చర్యకరమే.
Also Reaed:Rana Daggubati: ప్రముఖ హీరోయిన్ స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన రానా దగ్గుపాటి