సమయం, సందర్భాన్ని బట్టి ప్రాధాన్యం మారిపోతుంది. పిల్లనిస్తాం అన్నపుడు పెళ్లి చేసుకుంటే అల్లుడికి వుండే గౌరవం వేరు, కోరి పిల్ల కావాలని చేసుకుంటే దక్కే మర్యాదలు వేరుగా ఉంటాయి. బీజేపీ-జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. 2014 ఎన్నికలలో టీడీపీతో జతకట్టి దెబ్బ తిన్న బీజేపీ, 2019 ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం చేసింది. పవన్ అప్పుడు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపలేదు. అలాగే బీజేపీ పార్టీపై మరియు ప్రధాని అభ్యర్థి మోడీపై పరుష పదజాలంతో సభలలో విరుచుకుపడ్డాడు. ఎన్నిక ఫలితాల తరువాత తత్త్వం బోధపడింది. రెండు చోట్ల ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఒంటరిగా పోరాడండం కంటే అధికార పార్టీ అండతో ముందుకు వెళదాం అనే ఆలోచన కావచ్చు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఒక్కసారిగా మోడీకి అనుకూలుడు మరియు విధేయుడు అయిపోయాడు. మోదీపాలన భేష్ అంటూ పొగడడం మొదలుపెట్టాడు. ఒకరకంగా సిద్ధాంతాలు కూడా మార్చేశాడు. పూర్తి హిందూవాది అయిపోయాడు.
Also Read: కన్నా లక్ష్మీనారాయణ అడుగులు ఎటువైపు?
బీజేపీ కంటే అధిక భాగం ఓటు బ్యాంకు జనసేన పార్టీకి ఉన్నా ప్రాధాన్యం విషయంలో వాళ్ళ తరువాతే. పవన్ చేసిన వ్యాఖ్యలు, విషయాల పట్ల స్పందించే తీరు బీజేపీకి కట్టుబడి ఉండాల్సిందే. బీజేపీతో పొత్తు తరువాత పవన్ స్వేఛ్ఛగా ఏ విషయంపై స్పందించడం లేదు. బీజేపీ స్టాండ్ ఏమిటీ అని తెలుసుకున్న తరువాతే తన అభిప్రాయం చెబుతున్నారు. ఇక అధికారికంగా పొత్తుపెట్టుకున్నా, ఎవరి కుంపటి వాళ్లదే అన్నట్లు వీరి రాజకీయాలు సాగుతున్నాయి. ఎక్కడా కూడా బీజేపీ మరియు జనసేన కలిసి ప్రెస్ మీట్లలో పాల్గొన్న దాఖలు కనిపించడం లేదు.
Also Read: ముక్కోణ పోరులో బాబు అవుట్..!
ఏదిఏమైనా 2024 ఎన్నికల సమయానికి బీజేపీ-జనసేన సంస్థాగతంగా ఎదిగి ఏపీలో నిర్ణయాత్మక పార్టీగా మారాలన్నది వారి ఆలోచన. ఐతే 2024 ఈ కూటమి నుండి సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేది ఆసక్తికర అంశం. ఎందుకంటే ఒక పార్టీ విజయావకాశాలను నిర్ణయించే అంశాలలో ప్రధానమైనది సీఎం అభ్యర్థి ఎంపిక. సీఎం అభ్యర్థి సమర్థుడు అని భావించినప్పుడు మాత్రమే, నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. బీజేపీ-జనసేన పొత్తులో పెత్తనం అంతా బీజేపీది అయినప్పుడు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ఒప్పుకుంటారా అనే సందేహం కలుగుతుంది. ఒక వేళ ఎన్నికల తరువాత ఆ లెక్కలు చూసుకుందాం అంటే, ప్రజల్లో మరింతగా విశ్వాసాన్ని కోల్పోతారు. గెలుపోటములు అటుంచితే, సీఎం అభ్యర్థిని నిర్ణయించడం అనేది చాలా అవసరం. మరి 2024 ఎన్నికలకు ముందు ఈ విషయం బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఎలాంటి సంఘటనలకు దారితీస్తుందో చూడాలి.