Kumara Swamy : కర్నాటకలో జేడీఎస్ ను దెబ్బతీసింది ఎవరు? కుమారస్వామికి మాట ఇచ్చి హ్యాండిచ్చింది ఎవరు? డబ్బు సాయం చేస్తామని చెప్పి తప్పించుకున్నదెవరు? ఇప్పుడు ఇదే అంతటా చర్చనీయాంశంగా మారింది. కర్నాటక పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంతలో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్స్ పెంచేశాయి. హంగ్ ఫలితాలు వెల్లడించాయి. జేడీఎస్ కీరోల్ ప్లే చేస్తుందని చెప్పాయి. అయితే మరోవార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చక్కెర్లు కొడుతోంది. గెలిచే అవకాశాలున్న చోట సైతం డబ్బులు ఖర్చుపెట్టలేక జేడీఎస్ చేతులెత్తేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రకమైన ప్రచారానికి నిజం చేకూరేలా జేడీఎస్ నేత కుమారస్వామి అటువంటి వ్యాఖ్యలే చేశారు. బుధవారం పోలింగ్ జరుగుతండగానే మీడియాతో మాట్లాడారు. గెలుపు అవకాశాలున్న 25 నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బ తగలవచ్చని అంగీకరించారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టకపోవడమే కారణమని చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. మూడు పార్టీలు గణనీయంగా డబ్బులు ఖర్చుపెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఓటర్లకు పెద్దఎత్తున తాయిలాలు ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కుమారస్వామి చెబుతుండడం విశేషం. ‘ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మందికి నేను ఆర్థికంగా అండగా నిలవలేకపోవడం నాకు బాధ కలిగించింది. నిధుల విషయంలో ప్రజల నుంచి నాకు సాయం లభిస్తుందని ఆశించా. కానీ అలా జరగలేదు. జేడీఎస్ కు గెలవగల నేతలు ఉన్న చిక్కబళ్లాపుర దొడ్డబళ్లాపుర వంటి అనేక నియోజక వర్గాల్లో.. అభ్యర్థుల కు అండగా నిలవడంలో నేను విఫలమయ్యాను.” అని కుమారస్వామి పోలింగ్ జరుగుతుండగానే ప్రకటించడం గమనార్హం.
అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ వెల్లడించిన ప్రకారం 20 నుంచి 30 స్థానాలు జేడీఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అంతకంటే ముందే కుమారస్వామి మాట్లాడారు. అంటే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన స్థానాల్లోనే జేడీఎస్ కు నష్టం జరిగిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అటు జేడీఎస్ వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక ఏదో రహస్యం జరిగిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఓ నాయకుడు హ్యాండివ్వడం వల్లే జేడీఎస్ పరిస్థితి తారుమారైందని ఆ పార్టీ వర్గాల్లో ఒకరకమైన ప్రచారం సాగుతోంది. ఆ నాయకుడు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది.
అయితే ఈ క్రమంలో అందరి వేళ్లూ కేసీఆర్ వైపే చూపెడుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఇదే మాదిరిగా కేసీఆర్ వ్యవహరించారని.. గత ఎన్నికల్లో జగన్ కు నగదు సాయం చేశారన్న ఆరోపణలున్నాయి. అటు బీఆర్ఎస్ విస్తరణకు భారీగా ఖర్చుపెట్టడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా జేడీఎస్ కు నగదు సాయం అందించేందుకు కేసీఆర్ ముందుకొచ్చారన్న టాక్ నడిచింది. ఇప్పుడు కుమారస్వామి నగదు అందలేదని చెబుతుండడంతో కేసీఆర్ హ్యాండిచ్చి ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. ఒక వేళ జేడీఎస్ కు ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కేసీఆర్ పేరు బయటకు వచ్చే చాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీలో.. ఏదో ఒకదానికి ప్రయోజనం చేకూర్చారన్న అపవాదును కేసీఆర్ మూటగట్టుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.