Chandrababu Support: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ జాతీయ స్థాయిలో కూడా విపరీతమైన ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటు వెనుక క్రియశీలక పాత్ర పోషించింది. అటు తెర వెనుక ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన ఉదంతాలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం కీలక భూమిక పోషించిన సందర్భాలున్నాయి. కానీ ప్రస్తుతం ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చంద్రబాబు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. కానీ చంద్రబాబు నుంచి ఉలుకూ పలుకూ లేదు. కనీసం ఒక ప్రకటన లేదు. సంఖ్యాబలంగా తక్కువగా ఉన్నామని ఏమో కాని అటు ఎన్డీఏకు కానీ.. ఇటు విపక్ష కూటమి అభ్యర్థికి కానీ సపోర్టు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. ప్రస్తుతానికైతే ఆయన మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఆయన ఎన్డీఏకు మద్దతు ప్రకటించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కేంద్ర పెద్దలకు ఎదురెళ్లే అవకాశం లేదు. గత ఎన్నికల్లో జగన్ ట్రాప్ లో పడి బీజేపీని దూరం చేసుకున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు బీజేపీ పెద్దలకు కూడా చంద్రబాబు వ్యవహార శైలి నచ్చడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలతో కూటమి కట్టి మరి కయ్యానికి కాలు దువ్వారు. అంతటితో ఆగకుండా దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అందుకే చంద్రబాబు అంటేనే బీజేపీ పెద్దలు ఆమడదూరం జరిగిపోతున్నారు. మరోవైపు జనసేన, బీజేపీతో కలిసి కొత్త కూటమి కట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు జనసేన వరకూ ఓకే అయినా… బీజేపీ విషయంలో మాత్రం పాచిక పారడం లేదు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ చంద్రబాబు తీసుకోలేకపోతున్నారు. నాడు విపక్ష కూటమికి అన్నీతానై వ్యవహరించిన చంద్రబాబు సంకట స్థితిలో పడిపోయారు. అటు దేశ వ్యాప్తంగా ఉన్న విపక్ష నేతలు కూడా చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకొని ఆయనకు కలుపుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు.

వైసీపీ దూకుడు..
అయితే ఈ విషయంలో అధికార వైసీపీ మాత్రం దూకుగా ఉంది. ఎన్డీఏ బలపరచిన అభ్యర్థికి ద్రౌపది ముర్ముకు బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. బీజేపీ పెద్దలు అడగక ముందే తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సంకేతాలు పంపింది. ఇలా అభ్యర్థిని నిలిపారో లేదో వైసీపీ స్పష్టమైన ప్రకటన చేసింది. ద్రౌపది ముర్ము నామినేషన్ పర్వానికి ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. వాస్తవానికి సంఖ్యాబలంగా చూసుకుంటే టీడీపీ కంటే వైసీపీ గణనీయమైన ఆధిక్యతలో ఉంది. ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. టీడీపీకి కేవలం 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలే ఉండడంతో బీజేపీ పెద్దలు కూడా వైసీపీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినా దేశంలో వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు వెన్నుదన్నుగా నిలుస్తాయని భావించుకుంటూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీలు కూడా కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఎన్డీఏకు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ, బీజేడీలు ఎన్డీఏలో దాదాపు చేరినట్టే. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయి.

బీజేపీ పెద్దల భావన అదే…
మరోవైపు జాతీయ ప్రయోజనాలను ఆశించే ఏపీలో బీజేపీ ఏమైపోయిన పర్వాలేదన్నట్టుగా కేంద్ర పెద్దల భావనగా ఉంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామన్న ఏ ప్రయత్నమూ ఫలించడం లేదు. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణతో పోలిస్తే పార్టీ బలోపేతం అయిన పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అటు జనసేన, ఇటు టీడీపీ స్నేహ హస్తం అందిస్తున్నా బీజేపీ పట్టించుకోకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ గమనించిన చంద్రబాబు ప్రస్తుతానికి సైలెంట్ అయిపోవడమే మంచిదన్న భావనకు వచ్చారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ చేసింది నేను.. వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసింది నేను అంటూ ఆయన అన్ని వేదికల్లో చెప్పుకొచ్చేవారు. కానీ తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం చేయకపోవడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడడం లేదు.
చివరి నిమిషంలో మద్దతు..
ప్రస్తుతానికి ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఉన్నారు. కానీ ఇంతవరకూ ఇరు పక్షాలూ చంద్రబాబును ఆశ్రయించలేదని తెలుస్తోంది. పిలవని పేరంటానికి వెళ్లడం ఎందుకు అనుకున్నారో తెలియదు.. కానీ చంద్రబాబు కాస్తా దూరంగా ఉండిపోయారు. మరోవైపు తన ప్రత్యర్థి వైసీపీ చర్యలు గమనించే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. అయితే చివరకు చంద్రబాబు ఎన్డీఏ వైపు మొగ్గుచూపుతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు వీలైనంత వరకూ సంయమనం పాటించాలని భావిస్తున్నారు. జనసేన, బీజేపీతో కూటమి కట్టేందుకు కడవరకూ ప్రయత్నించనున్నారు. సో చంద్రబాబు మద్దతు మాత్రం ఎన్డీఏ బలపరచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకేనని ఖాయంగా తెలుస్తోంది.
Also Read: Senior Heroine Malavika: ఫేడ్ అవుట్ హీరోయిన్ కి సడెన్ గా క్రేజ్.. కారణం ఆయనే !
[…] […]