https://oktelugu.com/

BRS: పార్టీ పేరులో తెలంగాణను కత్తిరించుకున్నది ఎవరు? తెలంగాణ తనాన్ని అవమానించింది ఎవరు?

ఎన్నికల సమయం కాబట్టి.. రాజకీయ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు కాబట్టి.. కొన్నింటిని అంతగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది మాట్లాడే మాటలను మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 21, 2023 / 03:17 PM IST

    BRS

    Follow us on

    BRS: తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ తొలిదశ లో అభ్యర్థులను ఖరారు చేసింది. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. అది దాని దురవస్థ. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి ది మరో బాధ. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. ఇక పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అదొక కోపం ప్రజల్లో బాగా బలపడిపోయింది. అవి అలా ఉండగానే ఎన్నికల మేనిఫెస్టో పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించే కార్యక్రమం మొదలైంది. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి అనుకున్న విధంగా ఫాయిదా లభించడం లేదు. ఓవైపు కేసీఆర్, ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్ రావు, ఇంకోవైపు సంతోష్ రావు వంటి వారు ప్రచారాలు సాగిస్తున్నప్పటికీ ఎక్కడో తేడా కొడుతోంది.

    ఎన్నికల సమయం కాబట్టి.. రాజకీయ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు కాబట్టి.. కొన్నింటిని అంతగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది మాట్లాడే మాటలను మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిన్నటికి నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి. ఏ తాలూకూ ఫ్రస్టేషనో తెలియదు గాని కేటీఆర్ మాట్లాడిన తీరు మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. ఎన్నికల అవసరం కోసం ఏదో ఒకటి మాట్లాడటం కేటీఆర్ కు ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ఈరోజు నమస్తే తెలంగాణలో ఆ మాటల తాలూకు బ్యానర్ వార్త ప్రచురితమైంది..”తెలంగాణ ఆత్మగౌరవమా?, ఢిల్లీ అహంకారమా?” అనే శీర్షికతో వీరలెవల్లో వార్తను ప్రచురించారు. ఇక్కడ అటు కేటీఆర్ గానీ ఇటు వార్తను ప్రచురించే నమస్తే తెలంగాణ యాజమాన్యం గాని మరిచిపోయింది ఒకటే. కాంగ్రెస్, బిజెపి జాతీయ పార్టీలు. అవి ఉప ప్రాంతీయ పార్టీలు కాదు. వాటి అధిష్టానాలు ఢిల్లీలోనే ఉంటాయి. అయినంత మాత్రాన వాళ్లు పోటీ చేస్తే, ప్రజలను ఓట్లు అడిగితే అది ఢిల్లీ అహంకారం ఎలా అవుతుంది? తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసినట్టు ఎందుకు అవుతుంది? ఆ పార్టీల తరఫున పోటీ చేసేది తెలంగాణ వాళ్లే కదా.. రేపు పొద్దున అవి గెలిస్తే తెలంగాణ బిడ్డలే ముఖ్యమంత్రి అవుతారు కదా! తెలంగాణలో ఓట్లు అడిగితే, తెలంగాణ అధికార పార్టీ చేసిన తప్పులను ఎండగడితే అది తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఎలా అవుతుంది?

    కేటీఆర్ చెప్పినట్టు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మారింది కదా? దేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పాలని, గత్తర లేపాలని తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకున్నది ఎవరు? పార్టీ పేరులో తెలంగాణను కత్తిరించుకున్నది ఎవరు? ఇలా తెలంగాణతనాన్ని అవమానించింది ఎవరు? రేపటి నాడు ఏ మహారాష్ట్రలోనో ఏ ఠాక్రే మనసుడో “మరాఠీ అస్తిత్వం ముఖ్యమా? హైదరాబాద్ అహంకారం ముఖ్యమా” అని ప్రశ్నిస్తే అది కేటీఆర్ కు ఆమోదయోగ్యమేనా? ఇంతకీ కెసిఆర్ మార్చిన జాతీయ పార్టీ రాబోయే ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో పోటీ చేస్తున్నదా కేటీఆర్ సార్? తెలంగాణ తనాన్ని వదిలేసుకున్నా ఉపయోగం లేకుండా పోయిందా? వ్రతం చెడినప్పటికీ ఫలితం లేకుండా పోయిందా? ఫాయిదా దక్కుతుందని పార్టీ పేరు మారిస్తే పూర్తిగా సీన్ రివర్స్ అయిందా? అందుకే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారా? అంటే వీటికి అవును అనే సమాధానాలు వస్తున్నాయి.

    ఈ సువిశాల భారత దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ఎన్నికల్లో పోటీ పడొచ్చు. ఎవరు విజేతలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేతప్ప ఇందులో రాష్ట్రాన్ని ఆగం చేయాలనే కుట్ర ఏముంది? వాళ్లకు వేస్తే రాష్ట్రాన్ని ఆగం చేయడమా? చివరకు రాహుల్ వ్యంగ్యాన్ని విసురుతూ మోడీని పార్లమెంటులో కౌగిలించుకుంటే అది కూడా కేటీఆర్ కు దోస్తీ లాగా కనిపిస్తోంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కేటీఆర్ కు ఇది దోస్తీ లాగా ఎలా కనిపించిందో అంతు పట్టకుండా ఉంది. కెసిఆర్ పాలనలో ఏం తక్కువైందని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.. హైదరాబాద్ బాధిత జర్నలిస్టుల నుంచి మొదలుపెడితే నిరుద్యోగుల వరకు చాలామంది సమాధానాలు చెబుతారు.. ఎస్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని, సోనియాగాంధీని గతంలో తిట్టాడు. ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమకారులను తరిమిన నేతలను మీరెందుకు కౌగిలించుకొని పెద్దపెద్ద పదవులు కట్టబెట్టారు. ఆ పార్టీకి ఐదారులు సీఎం అభ్యర్థులు ఉన్నారు. అంటే ఓట్లు వేసే ఓటర్లే లేరా? మరి ఓటర్లు లేని పార్టీని చూసి మీరెందుకు మాట తూలడం? ఇక జీవన్ రెడ్డి ఏదో అన్నాడని మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేస్తున్నారట. ఇక్కడ సత్యవతి రాథోడ్ కి తెలియని విషయం ఏంటంటే జీవన్ రెడ్డి బతుకమ్మను అవమానించలేదు. భారత రాష్ట్ర సమితి మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దానిని బతుకమ్మకు ఆపాదించడం దేనికి? రాజకీయ పోరాటాలు నేరుగా ఉండాలి. మంచిగా ఉండాలి.. అలా ఉంటేనే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు.