West Bengal Political Change BJP Strategy: పశ్చిమ బెంగాల్‌లో కొత్తగాలి వీస్తోంది. అక్కడ రాజకీయాల్లో పెద్ద మార్పు రాబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీకి ఎదురుగాలి వీస్తోంది. దీంతో అమె ఫ్రస్టేషన్‌కు గురవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: ఏపీలో డిఎల్ఎఫ్.. పెద్ద ప్లాన్లు ఇవి
మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్..
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు కష్టాలు ఎదుర్కొంటోంది. దీంతో పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మానసిక ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఇది ఆమె వ్యవహారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించడం, సర్ విషయంలో ఆందోళన చేయడం, ఈసీపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఆందోళనలు చేయడం, రాష్ట్రపతి పదవిపై అవాకులు మాట్లాడటం, ప్రొటోకాల్ పాటించకపోవడం వంటివి ఇందుకు నిదర్శనాలు. ఈ పద్ధతి ఆమె ఆవేశంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సూచిస్తోంది. మరోవైపు, రాజకీయంగా మమతా చిన్న అంశాలను భారీ సమస్యలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ’బెంగాలీ, నాన్ బెంగాలీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వందేభారత్ రైళ్లలో నాన్–వెజ్ మీల్స్ అంశాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు.
బీజేపీ మైక్రో ప్లానింగ్..
ఇక బీజేపీ 2015 నుంచి బెంగాల్ అధికారం కోసం కఠిన పోరాటం చేస్తోంది. ఇప్పుడు ఫలితాలు కనిపించడం మొదలైంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ, మమతా ’ట్రాప్’లకు దూరంగా తమ స్వంత మార్గంలో ముందుకు సాగుతోంది. యువతలో నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పేదరికం, రాష్ట్ర అభివృద్ధి స్థిరంగా లేకపోవడం, మతోన్మాదం వంటి రాష్ట్ర–నిర్దిష్ట సమస్యలపై దృష్టి పెట్టింది. ’పరివర్తన్ యాత్ర’ పేరిట 5 వేల కిలోమీటర్ల విస్తృత ప్రచార యాత్ర చేపట్టారు. 9 ప్రాంతాల నుంచి 9 మంది కీలక నాయకులు ఈ యాత్రను నడుపుతున్నారు, ప్రతీ గ్రామం, ప్రతీ పల్లెను తాకేలా రూపొందించారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా, సామాజిక వర్గాల డేటాను ఉపయోగించి మైక్రో–లెవల్ ప్లానింగ్ చేస్తోంది. ఇది గ్రామ, మండల స్థాయిలో టార్గెటెడ్ ప్రచారానికి దోహదపడుతోంది.
సర్వేలో బీజేపీకి ఎడ్జ్..
ఐదు కీలక జిల్లాలు పురూలియా, పశ్చిమ మిడ్నాపూర్, పశ్చిమ వర్ధమాన్, చార్‌గామ్, బాంకురాలో ఓ సంస్థ ప్రజల మూడ్ తెలుసుకునేందకు సర్వే చేసింది. ఇందులో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. పురూలియా జిల్లాలో గత ఎన్నికల్లో బీజేపీ 6 సీట్లు, టీఎంసీ 3 సీట్లు. తాజా సర్వేలో 6 సీట్లు మళ్లీ బీజేపీకి, మిగిలిన 3 సీట్లలో కొద్ది కష్టపడితే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 15 సీట్లు ఉండగా, గతంలో బీజేపీ 2 సీట్లు గెలిచింది. ఇప్పుడు 5 సీట్లు గెలవడానికి మంచి అవకాశం ఉంది. చార్‌గామ్ జిల్లాలో గతంలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు.. ఈసారి మూడు స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. బాంకురా జిల్లాలో గతంలో 8 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 12 సీట్ల వరకు ఆధిక్యం కనబరుస్తోంది. పశ్చిమ వర్ధమాన్ జిల్లాలోనూ బీజేపీ బలపడుతోంది. మొత్తంగా ఉత్తర బెంగాల్‌లో బీజేపీ స్పష్టమైన ఎడ్జ్‌తో ముందంజలో ఉంది.
బెంగాల్ బీజేపీకి ఇంతకాలం కొరకరాని కొయ్యలా మారింది. ఈసారి మాత్రం యాత్రలు, మైక్రో–స్ట్రాటజీలు గాలి మార్పును స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ మరింత బలపడనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మమతా ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, బీజేపీ ప్రచార బలం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పరివర్తనకు దారి తీసే అవకాశం ఉంది.