YCP vs TDP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా రెండు పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ సమఉజ్జీలుగా నిలుస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ఇంకా రెండున్నరేళ్ల సమయమున్నా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నాయి. భౌతిక దాడులకు కూడా వెనుకాడటం లేదు. దీంతో ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

సంక్షేమ పథకాలు తప్ప వైసీపీ ఘనత ఏమీ లేదు. అభివృద్ధి కార్యక్రమాల ఊసే లేదు. దీంతో వీటిని ప్రధానాయుధాలుగా చేసుకుని టీడీపీ ముందుకు వెళుతోంది. ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకే వైసీపీ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన పరిణామాలతో టీడీపీ ప్రజల్లో తన పరపతి పెంచుకోవాలని భావిస్తోంది. దీనికోసం పలు మార్గాలు అన్వేషిస్తోంది. 36 గంటల దీక్షకు పూనుకుని అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.
టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత బాబు నిర్ణయించారు. ఇందుకోసం ఢిల్లీ నేతలను కలిసి కూడా తమకు జరిగిన అన్యాయాన్ని ఎదురించాలని భావిస్తున్నారు. ఇదే సందర్భంలో బీజేపీతో స్నేహహస్తం కూడా అందించాలని చూస్తోంది. జరుగుతున్న పరిణామాలను అన్ని దారుల్లో ఉపయోగించుకోవాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీకి జనాదరణ తగ్గలేదని చాటిచెప్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రెండు పార్టీల మధ్య చోటుచేసుకుంటున్న గొడవల్లో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతారో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్య నాయకులతో చర్చిస్తూ తరువాత చేపట్టబోయే చర్యల గురించి న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో పార్టీలు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.