ప్రతియేటా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈసారి కరోనా కారణంగా బ్రహ్సోత్సవాలు కళతప్పేలా కన్పిస్తున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్సోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది.
Also Read: ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే
నేటి నుంచి ఈనెల 27వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నేటి సాయంత్రం మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో శ్రీవారి వాహనసేవలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8.30గంటల నుంచి 9.30వరకు పెద్దశేష వాహనసేవ ఉంటుంది. కరోనా నిబంధనల్లో భాగంగా ఈ సేవలన్నింటినీ ఆలయంలో ఏకాంతంగానే నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈనెల 23న జరిగే శ్రీవారి గరుడ సేవలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా గరుడ సేవకు హాజరుకానున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత కర్నాటక చౌల్ట్రీ నిర్మాణానికి ఇద్దరు ముఖ్యమంత్రులు శంఖుస్థాపన చేయనున్నారు. 27న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read: ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?
ఈసారి జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా ఆలయ సీనియర్ అర్చకుడు ఏఎస్ గోవిందాచార్యులు వ్యవహరించనున్నారు. ధ్వజారోహణంలో భాగంగా ఆయన ధ్వజస్తంభంపైకి గరుడపతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేదమంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. అనంతరం శ్రీవారి వాహనసేవలు ప్రారంభం కానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.