బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 292 స్థానాల్లో ఏకంగా 213 సీట్లు గెలుచుకొని అబ్బుర పరిచింది. కానీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన మమత.. సువేందు అధికారికి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఫలితంపై ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ.. ముఖ్యమంత్రిని తానే అవుతానని ప్రకటించారు.
నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొవచ్చు. అయితే.. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. దీంతో.. మమతా బెనర్జీ ఎక్కడి నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం బెంగాల్లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఖర్దాహా, జంగీపూర్, శంషేర్ గంజ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ ముగ్గురు అభ్యర్థులు చనిపోయారు. జంగీపూర్, శంషేర్ గంజ్ అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత చనిపోయారు. ఖర్దాహా అభ్యర్థి మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు.
విచిత్రంగా.. చనిపోయిన అభ్యర్థే ఎన్నికల్లో గెలిచారు. ఆ అభ్యర్థి కూడా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మూడు స్థానాలు మమత పోటీ చేయడానికి అవకాశం ఉంది. అయితే.. ఖర్దాహా స్థానంలో తృణమూల్ గెలిచింది కాబట్టి.. అక్కడి నుంచే పోటీ చేయొచ్చని అంటున్నారు. మరి, ఏ స్థానం నుంచి మమత బరిలో నిలుస్తారన్నది చూడాలి.