‘పుర‌’పోరులో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్‌!

తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎన్నికలు జరిగిన ఐదు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేష‌న్లలో గులాబీ జెండా ఎగరేసి క్లీన్ స్వీప్ చేసింది. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లతోపాటు జ‌డ్చ‌ర్ల‌, అచ్చంపేట‌, న‌కిరేకల్‌, కొత్తూరు, సిద్ధిపేట మునిసిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నిక‌లు జ‌రిగిన‌ అన్నిస్థానాల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఖ‌మ్మం కార్పొరేష‌న్లో మొత్తం 60 స్థానాల‌కు గానూ.. ఇప్పటి […]

Written By: Bhaskar, Updated On : May 3, 2021 7:32 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎన్నికలు జరిగిన ఐదు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేష‌న్లలో గులాబీ జెండా ఎగరేసి క్లీన్ స్వీప్ చేసింది. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లతోపాటు జ‌డ్చ‌ర్ల‌, అచ్చంపేట‌, న‌కిరేకల్‌, కొత్తూరు, సిద్ధిపేట మునిసిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నిక‌లు జ‌రిగిన‌ అన్నిస్థానాల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఖ‌మ్మం కార్పొరేష‌న్లో మొత్తం 60 స్థానాల‌కు గానూ.. ఇప్పటి వరకు 42 స్థానాల్లో ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఇందులో టీఆర్ఎస్ కూట‌మి 33 స్థానాలు గెలుచుకొని విజ‌య‌దుందుభి మోగించింది. కాంగ్రెస్ కూట‌మికి 6 సీట్లురాగా.. బీజేపీ కూట‌మి ఒక్క‌సీటుతో తేలిపోయింది. అటు వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లో మొత్తం 66 స్థానాల‌కు గానూ ఇప్ప‌టి వ‌ర‌కు 49 స్థానాల ఫ‌లితాలు వచ్చాయి. ఇందులో టీఆర్ఎస్ 33 చోట్ల విజ‌యం ఢంకా మోగించింది. బీజేపీ 10 స్థానాలతో కాస్త పోటీఇచ్చింది. కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు కార్పొరేషన్లలో పూర్తిస్థాయి ఫలితాలు రాకముందే టీఆర్ఎస్ జెండా ఎగిరింది. మునిసిపాలిటీల్లో అన్నిచోట్లా కారు జోరుకు అడ్డే లేకుండాపోయింది.

సిద్ధిపేటః ఈ పుర‌పాల‌క సంఘంలో మొత్తం 43 స్థానాల‌కు గానూ.. టీఆర్ఎస్ ఏకంగా 36 చోట్ల విజ‌యం సాధించింది. బీజేపీ ఒకే ఒక స్థానంతో స‌రిపెట్టుకుంది. ఇత‌రులు ఆరు చోట్ల గెలుపొందారు.

జ‌డ్చ‌ర్లః ఈ మునిసిపాలిటీలో మొత్తం 27 వార్డుల‌కు గానూ టీఆర్ఎస్ 23 స్థానాల‌ను ద‌క్కించుకొని విజ‌య‌దుందుభి మోగించింది. కాంగ్రెస్‌, బీజేపీ చెరో రెండు స్థానాలకు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి. దీంతో.. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి.

అచ్చంపేటః ఇక్క‌డ కూడా టీఆర్ఎస్ జ‌య‌కేత‌నం ఎగ‌రేసింది. ఈ మునిసిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండ‌గా.. టీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలిచి మునిసిప‌ల్ పీఠాన్ని ద‌క్కించుకుంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో విజ‌యం సాధించాయి.

న‌కిరేక‌ల్ః ఈ మునిసిపాలిటీని కూడా గులాబీ పార్టీనే సొంతం చేసుకుంది. ఇక్క‌డ మొత్తం 20 వార్డులు ఉండ‌గా.. 11 వార్డుల‌ను గులాబీ ద‌ళం సొంతం చేసుకుంది. ఫార్వ‌ర్డ్ బ్లాక్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ రెండు చోట్ల గెలుపొందాయి. ఒక చోట స్వ‌తంత్ర అభ్య‌ర్థి గెలుపొందారు.

కొత్తూరుః రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కొత్తూరు మునిసిపాలిటీని సైతం టీఆర్ఎస్ ద‌క్కించుకుంది. ఇక్క‌డ మొత్తం 12 వార్డులు ఉండ‌గా.. 7 చోట్ల గులాబీ జెండా ఎగిరింది. హ‌స్తం పార్టీ 5 వార్డుల‌ను కైవ‌సం చేసుకుంది.