ట్రంప్ భారత పర్యటన విజయవంతమా , విఫలమా అనేది అందరి నోళ్ళల్లో నానుతున్న మాట. ముందుగా ఒక మాట చెప్పాల్సివుంది. రాజకీయ పరిశీలకులు, మేధావులు వారి వ్యాఖ్యానాల్లో ఇచ్చే అభిప్రాయం మెరిట్స్ మీదకన్నా ఇప్పటికే వాళ్ళ మెదడుల్లో మోడీ పై ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని బట్టే వుంటుందికాని జరిగిన చర్చల సారాంశాన్ని బట్టికాదని గుర్తించుకోవాలి. ఇది అక్షరాలా సత్యం. కాబట్టి ఆ మీమాంస లోకి వెళ్లకుండా నేరుగా చర్చల సారాంశాన్ని బట్టి మాట్లాడుకుందాం.
ప్రధానమంత్రి మోడీ, అధ్యక్షుడు ట్రంప్ సంయుక్త ప్రకటనలో మాట్లాడినదాన్నిబట్టి చర్చలు స్థూలంగా సఫలమయ్యాయనే చెప్పొచ్చు. అన్నింటికన్నా ముందుగా చెప్పవలసివస్తే అమెరికా-భారత్ సంబంధాల్ని ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లటం ఆహ్వానించదగిన పరిణామం. ఇవి సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య దిశగా పయనించటం ముదావహం. చైనా భారత ఉపఖండంలో క్రమ క్రమేణా తిష్టవేయటం భారత రక్షణకి ముప్పుగా భావిస్తున్న తరుణంలో అమెరికా సంబంధాల స్థాయిని పెంచటం భారత్ కు ఉపయోగం. దానితోపాటు అత్యంత అధునాతన సాంకేతికత కూడిన హెలికాఫ్టర్లను భారత్ కు విక్రయించటానికి ఒప్పుకోవటం కూడా భారత్ రక్షణలో ముందడుగు వేయటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అమెరికా రక్షణ రంగం లో ఎవరికీ అందనంత దూరంలో ఉందనేవిషయం. కొన్ని సంవత్సరాల్లో చైనా అమెరికా కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించే అవకాశాలున్నా రక్షణ రంగంలో మాత్రం సమీప భవిష్యత్తులో అమెరికా దరిదాపుల్లోకి కూడా చైనాతో సహా ఏదేశమూ సరితూగదు. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఈ సంబంధాలతో మన రక్షణ వ్యవస్థ బలపడటం దేశప్రయోజనాల రీత్యా హర్షించదగ్గ పరిణామం.
రెండోది, అమెరికాలో ఇప్పటికే భారతీయులు గత రెండు దశాబ్దాలనుంచి పెద్ద సంఖ్యలో స్థిరపడి అన్నిరంగాల్లో రాణించటం చూస్తున్నాం. దానితోపాటు అక్కడనుంచి మన దేశానికి ప్రపంచంలోనే ఎక్కువగా డబ్బులు పంపించటం తెలిసిందే. ఇది మన ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తుంది. ఈ పర్యటన ఆ సంబంధాల్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిద్దాం.
మూడోది, ఇవి రెండు ప్రజాస్వామ్య దేశాలు కావటం కూడా ముఖ్యమే. అదే ఏ చైనాలోనో , రష్యాలోనో వెళ్లి ఉండటం మనకు ఇబ్బందికరం. అయినా వాళ్ళు రానివ్వరనుకో అది వేరే విషయం. రెండు సమాజాలూ చాలా విషయాల్లో సామీప్యతలు వున్నాయి. రెండూ సెక్యులర్ దేశాలు, బహు జాతుల, మతాల, ఆచారాల, భాషల కలయికలతో నడుస్తున్నవి. మననుంచి వాళ్ళు, వాళ్ళనుంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఆధునిక సమాజంలో ఈ రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మానవాళికి మేలుజరుగుతుంది.
నాలుగోది, గత దశాబ్దంలో వాణిజ్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఈ సంవత్సరం చైనాను దాటి మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. అయితే దీనితోపాటు ఇరుదేశాల ప్రయోజనాల రీత్యా కొత్త వాణిజ్య ఒప్పందం అవసరం ఏర్పడింది. దానికోసం ఇప్పటికే ఎన్నో దఫాలు చర్చలు జరిగినా ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు సంయుక్త ప్రకటనలో మోడీ చెప్పినదాన్నిబట్టి త్వరలో పరిమిత ఒప్పందం కుదిరే అవకాశాలు మెండుగా వున్నాయి. అదేసమయంలో భారీ ఒప్పందంకోసం కూడా ఒకేసారి చర్చలు మొదలవుతాయని కూడా ప్రకటించారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్యభాగస్వామి మాత్రమే కాదు అతిపెద్ద వాణిజ్య మిగులు వున్న దేశం కూడా. అందుకే భారత్ ఆచి తూచి అడుగులేస్తోంది. త్వరలో ఒప్పందం కుదరటానికి ట్రంప్ పర్యటన దోహదం చేస్తుందని చెప్పొచ్చు.
అదేసమయంలో భారత్ వైపునుంచి కొన్ని విషయాల్లో భయాందోళనలు వున్నాయి. ఇప్పటికే అమెరికా మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించింది. ఇప్పటివరకు చైనా, భారత్ లు అభివృద్ధి చెందే దేశాల కేటగిరీలో వున్నాయి. ఇప్పుడు వాటి కాటగిరీని మార్చటం భారత్ కి దెబ్బ. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈమార్పుతో మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇప్పటికే భారత్ దీనిపై నిరసన తెలిపింది.
అలాగే మన వాళ్ళు ఎంతోమంది హెచ్ 1 బి , ఎఫ్ 1, ఎల్ 1 వీసాలపై పనిచేస్తున్నారు. ట్రంప్ వచ్చినతరువాత వీటిపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాడు. దానితో మన ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రీన్ కార్డు నిబంధనల్లో దేశవాళీ కోటా ఉండటంతో మన భారతీయులు ఎంతోమంది ఎన్నోయేళ్ల నుంచి వెయిట్ లిస్ట్ లో వున్నారు. ఇదే నిబంధనలు కొనసాగితే మనవాళ్లకు దశాబ్దాలతరబడి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదు. దీనిపై ట్రంప్ సానుకూలంగానే వున్నాడు కానీ అమెరికా కాంగ్రెస్ లో మార్పులకోసం చేసే ప్రయత్నాలు సఫలం కావట్లేదు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున ఆలోపల మార్పులు జరిగే అవకాశం లేదు. అయినా భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. ఇందులో ఎక్కువ నష్టపోతోంది తెలుగువాళ్లే.
మొత్తం మీద చూస్తే ట్రంప్ పర్యటన విజయవంతమయిందనే చెప్పాలి. ఈ పర్యటనలో జరిగిన ఒప్పందాలకన్నా ముందు ముందు ఇంకా సంబంధాలు మెరుగు పడే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే ఈ సానుకూల ప్రభావాన్ని తగ్గించాలనే కుట్ర మన భూభాగంపైనే జరగటం విచారకరం. దీనికి పాకిస్తాన్ అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అయినా ఇవేమీ భారత్ పురోభివృధిని ఆపలేవు. త్వరలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగటం ఖాయం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Whether trump india visit successful
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com