Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో తెలంగాణ ప్రాంతేతర ఓటర్లపై అధికార బీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ పెట్టింది. హోరా హోరీగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఓట్లు కీలకంగా మారడంతో, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో మూడు పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగట్టేందుకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఓటర్లను ఇంటింటికీ వెళ్లి కలుస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇక గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో 47 కార్పొరేటర్లను గెలిచిన బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది. ఇందుకోసం జనసేనతో కూడా పొత్తు పెట్టుకుంది. సెటిటర్లతోపాటు, పవన్ ఫ్యాన్, గ్రేటర్ యూత్ బీజేపీకి ఓటు వేస్తారని కమలం నేతలు భావిస్తున్నారు.
అన్ని పార్టీల్లో ప్రత్యేక ప్రణాళిక..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం దూసుకుపోతున్నాయి. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా ఓటర్లను చేరువ అయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పక్కాగా ఓటింగ్ తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల వారు ఉండడంతో వారి ఓట్లపై మూడు పార్టీలు దృష్టిపెట్టాయి. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నాయి.
సెటిలర్లే కీలకం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా ఆంధ్ర , రాయలసీమతో పాటు ఉత్తర భారత దేశానికి చెందిన ఓటర్లు పలు నియోజకవర్గాల్లో భారీగా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో వీరి ఓట్లను రాజకీయ పార్టీలు కీలకంగా భావించాయి. ఇప్పుడు కూడా హోర హోరీగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లు తమ వైపు తిప్పుకునే పనిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆయా సామాజికవర్గ నేతల భేటీలు పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఇక సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగులు చేసిన అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను ఎండగడుతున్నారు.
బీఆర్‌ఎస్ ఇలా..
2014 ఎన్నికల్లో గ్రేటర్‌లో ఎక్కువ సీట్లు గెలవకపోయినా.. 2018 వచ్చే సరికి పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలపై పైచేయి సాధించింది బీఆర్‌ఎస్. ఇప్పుడు కూడా గ్రేటర్‌లో అదే స్థాయిలో సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలలో మునిగి తేలుతోంది గులాబీ పార్టీ. ఎంఐఎంతో పొత్తు గ్రేటర్‌లోనే ఎక్కువగా లాభిస్తోందని లెక్కలు వేసుకుంటోంది.
బీజేపీవైపు యూత్..
ఇక నగరాలు, పట్టణాల్లోని యువత ఎక్కువగా బీజేపీ వైపు ఉంటుంది. ఈసారి కూడా గ్రేటర్ యూత్ బీజేపీవైపు నిలుస్తుందని అంచనా వేస్తోంది. గత మున్సిల్ ఎన్నికల్లో ఎక్కువ కార్పొరేషన్లలో విజయం సాధించినందున, ఆ ప్రభావం కూడా కలిపి వస్తుందని, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, ఒక వర్గానికే బీఆర్‌ఎస్ అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు బీజేపీకి ఆభిస్తుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటన్నారు. జనసేనతో పొత్తు కలిసి వస్తుందని పేర్కొంటున్నారు. ఇక ఈనెల 27న ప్రధాని మోదీ నిర్వహించే రోడ్‌షో గ్రేటర్ ఓటర్లను కమలంవైపు ఆకర్షిస్తుందని అంటున్నారు.
కాంగ్రెస్ స్పెషల్ ప్లాన్..
ఇక కాంగ్రెస్ కూడా గ్రేటర్‌లో పట్టు కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుండడంతో గ్రేటర్ పరిధిలోని ఆంధ్రా, రాయలసీమ ఓటర్లు తమకు ఓటు వేస్తారని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంక కమ్మ, కాపు ఓటర్లు ఈసారి కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అధికార పార్టీ ఎమ్మెల్యేల కబ్జాలు, ఆగడాలు తమకు లాభిస్తాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల ఎటువైపు ఉంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గ్రేటర్ ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారు.. ఈసారి ఏ పార్టీ పట్టు సాధిస్తుంది అనేది అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే..!