AP BJP: ఏపీ బీజేపీ నాయకులు సైలెంట్ గా ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన వారు.. ప్రస్తుత రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన అనివార్య పరిస్థితి వారికి ఎదురవుతోంది. తెలంగాణ ఫలితాలు, తెలుగుదేశం పార్టీతో పొత్తు తదితర పరిణామాలను గమనించి నిర్ణయం తీసుకోవడానికి వారు సిద్ధపడుతున్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపితో విభేదించింది. ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ బిజెపిలో చేరారు. ఇలా చేరి క్రమంలో వారు టిడిపి నాయకత్వంపై కానీ, వారిపై టిడిపి నేతలు కానీ ఎటువంటి విమర్శలు చేయలేదు. వారంతా టిడిపి తో పాటు చంద్రబాబు ప్రయోజనాల కోసమే వైసీపీలో చేరారన్న ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో వారి కదలికలపై అందరి దృష్టి పడింది.
ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బిజెపి ప్రధాన పార్టీగా ఉంది. అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ లతో పోరాడుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. ఆ పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందో.. ఇప్పటివరకు స్పష్టత లేదు. కొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న జనసేన మాత్రం.. తెలంగాణలో బిజెపితో జతకట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చే ఫలితం బట్టి.. ఏపీలో కొత్త పొత్తులు పొడవనున్నాయి. అటు ఏపీ బీజేపీ నాయకులు ఒక నిర్ణయానికి రానున్నారు.
కర్ణాటక మాదిరిగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే
.. ఏపీలో సమూల మార్పులు రానున్నాయి. బిజెపిలో ఉన్న ప్రో టిడిపి నాయకులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి.. బిజెపి గౌరవప్రదమైన స్థానాలు సాధిస్తే మాత్రం.. వారంతా బిజెపిలో కొనసాగనున్నారు. టిడిపి, జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకోవాలని నాయకత్వంపై ఒత్తిడి చేయనున్నారు. ఇలా ఎలా చూసిన డిసెంబర్ 3 తర్వాత ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.