
Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు వాహనం రోడ్డు ఎక్కేది ఎప్పుడు? నెలా,, రెండు నెలలా? ఈ విషయంలో ఎందుకు స్పష్టత లేదు? అదిగో ఇదిగో అంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు పవన్ అజెండా ఏమిటి? వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారా? లేకుండా ప్రత్యర్థులకు అందని ఆలోచనలు చేస్తున్నారా? జనసైనికుల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం నెలకొంది. పవన్ మాత్రం సినిమా షూటింగ్ లతో పాటు మధ్యలో రాజకీయ వేదికలు పంచుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. మొన్న బందరులో జనసేన ఆవిర్భావ సభకు హాజరయ్యారు. తాజాగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని తెలుస్తోంది.
ఎప్పటికప్పడు వాయిదా
ఆది నుంచి వారాహి యాత్రపై ఒకరకంగా అంచనాలు ఉన్నాయి. ఈ యాత్రతో జనసేన గ్రాఫ్ పెరుగుతుందని జన సైనికులు అంచనా వేస్తున్నారు. కానీ వారాహి వాహనం మాత్రం ఇంతవరకూ రోడ్డెక్కలేదు. పార్టీ ఆవిర్భావ సభకు విజయవాడ నుంచి బందరుకు వారాహి వాహనంపై పవన్ బయలుదేరారు. జన స్పందన అంతా ఇంతా కాదు. దీంతో వారాహి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లోకి మారాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో అదే వేగంతో వారాహి యాత్ర షెడ్యూల్ ను ప్రకటిస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. దీనిపై అసలు స్పష్టతే రాలేదు. మరోవైపు వైసీపీ, టీడీపీ ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్ధపడుతున్నాయి. జగన్ మా నమ్మకం నువ్వే వంటి కార్యక్రమాలతో ఎన్నికలరంగంలోకి అడుగుపెట్టారు. అటు టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతోంది. చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ ఎందుకు బయటకు రావడం లేదని సగటు జన సైనికుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు.
లోలోపల కసరత్తు..
అయితే పవన్ మాత్రం పక్కా వ్యూహంతో ప్రజల ముంగిటకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు క్లీయర్ కట్ గా చెప్పి వారి అభిమానం సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. పొత్తుల అంశం తెలాక.. ఎందుకు పొత్తు పెట్టుకున్నామో ప్రజలకు వివరించి వారి అభిమానం చూరగొనాలన్నది పవన్ ప్లాన్. ఎన్నికలకు ముందు వారాహి ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసేందుకు కసరత్తు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవర్ షేరింగ్ తో పాటు సీట్ల పంపకం తదితర వాటిని ఒక కొలిక్కి తెచ్చి ప్రజల ముంగిటకు వెళ్లడానికి పవన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్ట సమాచారం. అటు సినిమా షూటింగ్ లతో పాటు జనసేన మేనిఫేస్టోపై కూడా పవన్ కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

కర్నాటక ఎన్నికల తరువాతే?
మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసిన పవన్ వారి ముందు కీలక ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. అయితే కర్నాటక ఎన్నికల తరువాత ఒక నిర్ణయానికి వద్దామని పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సొంతంగా ఎదగాలని బీజేపీ పెద్దల నుంచి పవన్ కు సూచన వచ్చినట్టు టాక్ నడుస్తోంది. అటు పవన్ పెట్టిన ప్రతిపాదనలకు సైతం వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. దీంతో ఇది పొత్తుల అంశం అయి ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికల తరువాత ఒక సానుకూలాంశం వెల్లడయ్యే అవకాశం ఉంది. పొత్తులు కుదిరిన మరుక్షణం పవన్ వారాహి రోడ్డెక్కె చాన్స్ ఉంది. అదే జరిగితే ఎన్నికల వరకూ ఆ వాహనం ఏపీ వ్యాప్తంగా తిరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో ఒకటి, రెండు నెలల్లోనే వారాహి యాత్ర ఉండే అవకాశముందన్న మాట.