
ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పండించిన పంట అమ్మకుని రెన్నెళ్లు దాటినా ఇంతవరకు చిల్లిగవ్వ కూడా రాలేదు. దీంతో పెట్టుబడి ఎలా పెట్టేది? పంటలు ఎలా పండించుకునేది అని అన్నదాతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి నిదులు రావడం లేదు. దీంతో అధికారిక కార్యక్రమాల్లో నేతల్ని నిలదీస్తున్నారు.
ప్రజాప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోతోంది. రైతులకు అందాల్సిన డబ్బులు పంపిణీలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్తం కాని పరిస్థితి. రబీ కాలంలో రైతులు పండించిన పంటలో 35 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
దాని విలువ దాదాపు రూ.6600 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు రైతులకు రూ.3200 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మిగతా సొమ్ము పెండింగ్ లో ఉంది. ఒక వారం కాదు రెండు వారాలు కాదు. నెలల తరబడి ఈ సొమ్ము చెల్లింపుల వరకు రావడం లేదు. ప్రస్తుతం వర్షాకాలంవచ్చేసినా ఇంతవరకు రైతుల వద్దకు రాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కానీ చెల్లింపుల సమస్య రాలేదు. ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకు నిధులు చెల్లించాలని నిర్దేశించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విమర్శలు చేసేది. తాము అధికారంలోకి వచ్చాక పర్ ఫెక్ట్ గా చేస్తామని చెప్పేవారు. తీరా అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. 21 రోజుల్లో చెల్లిస్తామన్న డబ్బులు రెండు నెలలు దాటినా కనిపించడం లేదు. ప్రస్తుతం రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
బియ్యం సేకరించడానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ర్ట ప్రభుత్వం భరించదు. కేంద్రమే భరిస్తుంది. అయితే కేంద్రానికి ఇవ్వాల్సిన పత్రాలన్ని సరిగ్గా సమర్పిస్తే తక్షణమే విడుదల అవుతాయి. రైతులు ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వమే చెల్లించేది. కేంద్రం నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు సర్దుబాటు చేసుకునేది. కానీ ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇతర అవసరాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైతులు ఆందోళనలను తీర్చేందుకు అసలేం జరుగుతుందో తెలియడం లేదు.