ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టీచర్ల భర్తీ ప్రక్రియపై స్పష్టతనిచ్చింది. విద్యావ్యవస్థపై సీఎం జగన్ సమీక్ష తర్వాత వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఏపీలో నూతన విద్యా విధానం అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఈ విధానం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తుందని సజ్జల తెలిపారు. ఆ తర్వాతే టీచర్ల పోస్టుల భర్తీ చేపడుతామన్నారు.
ఒక్క పాఠశాల కూడా ఏపీలో మూతపడకుండా నూతన విద్యా విధానాన్ని ఏపీప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం 8వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండాల్సిన పరిస్థితి ఉందని.. నూతన విద్యా విధానంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.
ఏపీలో గత రెండేళ్లలో ఎక్కడా లేని విధంగా 183480 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు జగన్ వివరించారు. జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య తగ్గిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది పోస్టుల సంఖ్య పెరగవచ్చన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని వివరించారు.