
జిల్లాల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ కు జిల్లాల కలెక్టర్లు కాళ్లు మొక్కడం హాట్ టాపిక్ గా మారింది. పరిపాలనలో హుందాతనంగా వ్యవహరించాల్సిన వారు రాజకీయ నాయకుల కాళ్లు మొక్కడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాకు బాస్ లుగా వ్యవహరించే వారే కాళ్లపై మోకరిల్లడం దారుణమని చెబుతున్నారు. అఖిల భారత సర్వీసులో ఎంపికై దేశంలో ఎక్కడైనా పనిచేసే సామర్థ్యమున్న అధికారులు ఇలా చేయడంపై బాహాటంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరి నిర్వాకాలు వైరల్ అవుతున్నాయి. వారి స్థాయిని దిగజార్చుతున్నాయని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
ఆదివారం సిద్దిపేట, కామారెడ్డి కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, శరత్ సీఎం కాళ్లకు మొక్కడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి వెంకట్రామిరెడ్డి మాత్రం తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆయనను తండ్రిగా భావించి ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఇది సమంజసంగా లేదు. ప్రతిభ ఆధారంగా నియమించబడి జిల్లా ప్రజలకు దారి చూపాల్సిన పవిత్ర వృత్తిలో కొనసాగుతూ రాజకీయ నాయకులకు వంగడం చర్చనీయాంశంగా మారింది.
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై ఎన్నో విమర్శలు పుట్టుకొస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిహారం విషయంలో ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా కేసీఆర్ కు ఇష్టమైన వ్యక్తి కావడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్ కాళ్లకు మొక్కి మార్కులు కొట్టేయాలని చూశారు. ఇదే విధంగా కామారెడ్డి కలెక్టర్ శరత్ సైతం తన అభిమానాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్ కాళ్లకు మొక్కడం సంచలనంగా మారింది.
చరిత్రలో సివిల్ సర్వీసు అధికారులకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించడంలో మన వారు తెలుసుకోవడం లేదు. ప్రధానిగా పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలను సైతం తప్పు పట్టిన అధికారులు ఐఏఎస్ లన్న సంగతి మరిచిపోకూడదు. దారితప్పే రాజకీయ నేతల నిర్ణయాలను తప్పు పట్టి వారిని సరైన విధంగా నడిపించే సత్తా ఉన్న వారు వారి కాళ్లకు మోకరిళ్లడం అసమంజసం. అధికార పార్టీకి తలొగ్గడం భావ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాధ్యత గల స్థాయిలో ఉంటూ నీతిమాలిన పనులు చేయడం వారికి తగదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని సూచిస్తున్నారు.